Pawan Kalyan : హోం మంత్రి అనిత విషయంలో పవన్ కల్యాణ్ టంగ్ స్లిప్ అయ్యారా..!?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా హోంమంత్రి అనితను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో అనిత మరింత ఫోకస్ పెట్టాలనే విధంగా పవన్ కల్యాణ్ సూచించారు. నేరాలు చేసిన వాళ్లు తప్పించుకు తిరుగుతున్నారని.. కొంతమంది నేరస్థులు కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇలాంటి వాళ్ల విషయంలో పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. భారతీయ శిక్షాస్మృతిలో ఏముందో అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపై లేదా అని పవన్ కల్యాణ్ నిలదీశారు. ఇలాంటి వాటిపై హోంమంత్రి అనిత శ్రద్ధ పెట్టాలన్నారు.
ఒకవేళ తానే హోంమంత్రినైతే పరిస్థితి మరోలా ఉంటుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత కూడా స్పందించారు. పవన్ కల్యాణ్ అన్న దాంట్లో తప్పేమీ లేదన్నారు. కొన్ని కేసుల విషయంలో పోలీసులు మెతకవైఖరి అవలంభిస్తున్నారని.. అలా వదిలిపెట్టొద్దని మాత్రమే పవన్ కల్యాణ్ సూచించారని ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు మంత్రి నారాయణ కూడా పవన్ కల్యాణ్ కామెంట్స్ లో తప్పు లేదన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలకు పోర్టుపోలియోల్లో జోక్యం చేసుకునే అధికారం ఉంటుదన్నారు. దీంతో పవన్ కల్యాణ్ కామెంట్స్ ను కూటమి నేతలు పాజిటివ్ గానే రిసీవ్ చేసుకున్నట్టు అర్థమవుతోంది.
అయితే శాంతిభద్రతల విషయంలో పవన్ కల్యాణ్ అనవసరంగా మంత్రి అనితను టార్గెట్ చేసినట్లు అర్థమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అరకొర జ్ఞానంతో పవన్ కల్యాణ్ ఇలా మాట్లాడారని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వాస్తవానికి శాంతిభద్రతల పోర్టుపోలియో హోంమంత్రి అనిత దగ్గర లేదు. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే ఉంది. పవన్ కల్యాణ్ మాత్రం లా అండ్ ఆర్డర్ అనిత దగ్గర ఉందనుకొని పొరబడ్డారు. అనితను అలర్ట్ చేశారు. ఆవిడ కూడా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను పాజిటివ్ గానే తీసుకోవడంతో పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదు.
ఒకవేళ పవన్ కల్యాణ్ కామెంట్స్ ను ఇంకెవరైనా నెగెటివ్ గా తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. వాస్తవానికి సహచర మంత్రిపై కామెంట్స్ చేయడం ఎవరికైనా కరెక్ట్ కాదు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే కేబినెట్ సమావేశంలో ప్రస్తావించవచ్చు. డిప్యూటీ సీఎంగా ఆ రైట్ ఎప్పుడూ పవన్ కల్యాణ్ కు ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్ అలా చేయలేదు. బహిరంగ వేదికపై సహచర మంత్రిపై కామెంట్స్ చేశారు. అది కూడా తనకు సంబంధం లేని పోర్టుపోలియో విషయంలో..! పవన్ కల్యాణ్ ఇలా పొరపడడం కొత్తేమీ కాదు. ఆయన ఆవేశంలో ఒక్కోసారి మిడిమిడి జ్ఞానంతో ఇలా టంగ్ స్లిప్ అవుతూనే ఉంటారు. అయితే కూటమి నేతలకు, పార్టీలకు ఆయనంటే గౌరవం ఉంది కాబట్టి చూసీచూడనట్లు పోతున్నారు. లేకుంటే మాత్రం పరిస్థితి మరో టర్న్ తీసుకునేది.