ASBL Koncept Ambience
facebook whatsapp X

పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ పవన్.. ఎన్డీఏలో పెరుగుతున్న ప్రాధాన్యం

పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ పవన్.. ఎన్డీఏలో పెరుగుతున్న ప్రాధాన్యం

పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం జనసేన పార్టీ అధినేత మాత్రమే కాదు. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) చేతిలో తిరుగులేని ప్రచారాస్త్రంగా మారారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ అస్త్రాన్ని ప్రయోగించిన కమలనాథులు.. త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరగబోయే బిహార్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పవన్ కళ్యాణ్ సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని క్రేజ్‌తో పాటు కోట్ల సంఖ్యలో వీరాభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్‌ తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో మాట్లాడగల సామర్థ్యం ఎన్డీఏ కూటమికి మరింత కలిసొచ్చే అంశంగా మారింది.

ఏపీలో మొదలై.. మహారాష్ట్ర మీదుగా.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొంది 100% స్ట్రైక్ రేట్ ప్రదర్శించిన జనసేనాని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని బీజేపీకి చేరువ చేసి అటు రాష్ట్రంలో, ఇటు కేంద్రంలో ఎన్డీఏ ఘన విజయంలో కీలక పాత్ర పోషించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కేవలం ‘పవన్’ (గాలి) మాత్రమే కాదని, ఆయనొక ‘ఆంధీ’ (తుఫాను) అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా కొనియాడారు. సొంత ప్రభుత్వంలోని లోపాలను సైతం నిర్మొహమాటంగా ఎత్తిచూపుతూ పాలనలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు.

సనాతన ధర్మ పరిరక్షకుడిగా...

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావద్దేశంలో ప్రకంపనలు సృష్టించాయి. సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయమంటూ ‘వారాహి డిక్లరేషన్’ రూపొందించిన పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పాన్-ఇండియా పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్‌గా, హిందూ ఫైర్ బ్రాండ్‌గా ఎదిగారు. తెలుగు సినీ రంగ దిగ్గజంగా తెచ్చుకున్న క్రేజ్ కంటే వేల రెట్లు అధిక క్రేజ్ ఆయనకు సనాతన ధర్మ పోరాటం తెచ్చిపెట్టింది. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా ఒకటేమిటి.. ఇంటర్నెట్ తెరిస్తే చాలు ఎటు చూసినా పవన్ కళ్యాణ్ ఒక ట్రెండింగ్ సబ్జెక్ట్‌గా మారిపోయారు. ఈ క్రేజ్‌ను ఓట్లుగా మలచుకోవచ్చని కమలనాథులు భావించారు. అందుకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను రంగంలోకి దించారు. ఆయనతో పలు సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన అడుగు పెట్టిన ప్రతి నియోజకవర్గంలో ‘మహాయుతి’ (ఎన్డీఏ) అభ్యర్థి గెలిచారు.

హిందీ బెల్ట్ లోనూ..

ఢిల్లీలో 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా 3 పర్యాయాలు గెలుపొంది దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ.. ఢిల్లీ అసెంబ్లీ పీఠం మాత్రం బీజేపీకి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. ఈసారి ఎలాగైనా ఆ పీఠాన్ని దక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం మహారాష్ట్ర తరహాలో ఢిల్లీలోనూ పవన్ కళ్యాణ్‌తో ప్రచారం చేయించాలని భావిస్తున్నట్టు తెలిసింది. కేవలం తెలుగు ప్రజల ఓట్లను ఆకట్టుకోవడం కోసమే కాదు, హిందీ సమాజంలోనూ ఆయన ఏర్పర్చుకున్న క్రేజ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ వ్యూహాలు రచిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :