Pawan Kalyan : ఢిల్లీలోనూ పవన్ నామస్మరణే..! మరింత పెరిగిన క్రేజ్..!!
“యే పవన్ నహీ హై.. ఆంధీ హై” అనే మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్ ఇవి. పవన్ కల్యాణ్ అంటే ఆయనకు ప్రత్యేక గౌరవం ఉంది. జనాల్లో విపరీతమైన అభిమానం, అణిగిమణిగి ఉండే స్వభావం, దేశం కోసం ఏదో ఒకటి చేయాలన్న తపని.. లాంటివి పవన్ కల్యాణ్ లో చూశారాయన. అందుకే పవన్ కల్యాణ్ ను అవకాశం వచ్చిన ప్రతిసారీ పొగుడుతూ ఉంటారు. ఆయనకు ప్రత్యేక గౌరవం ఇస్తుంటారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పవన్ కల్యాణ్ పేరు మార్మోగిపోతోంది. జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కల్యాణ్ ఓ మాట చెప్పారు. తాను రాజకీయాల్లో ఇప్పటికిప్పుడు ఏదో చేసేయాలనే ఉద్దేశంతో రావట్లేదన్నారు. పాతికేళ్ల లక్ష్యంతో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి అండగా నిలిచారు. ఆ తర్వాత ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో కలిసి ముందుకెళ్లారు. అయితే తాజా ఎన్నికల్లో మాత్రం పవన్ టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసి దిగ్విజయం సాధించారు. అది కూడా కనీవినీ ఎరుగని రికార్డులు సృష్టించారు. వంద శాతం స్ట్రైక్ రేటుతో చరిత్ర లిఖించారు. అప్పటి నుంచి పవన్ కల్యాణ్ ఇమేజ్ మరో రేంజ్ కు ఎదిగింది.
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో పూర్తిగా మునిగిపోయారు. సినిమాలు దాదాపు పక్కన పెట్టేశారు. రోజంతా రాజకీయాలు, పరిపాలన పైనే దృష్టి పెట్టారు. అంతేకాదు.. ఎక్కడైనా ఏదైనా చిన్నపొరపాటు జరిగినా దాన్ని వెంటనే సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికీ కొంతమంది చెలరేగిపోతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదంటూ ఆయన లేవనెత్తిన ప్రశ్న ఏపీలో పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత సోషల్ మీడియా సైకోలందరినీ లోపలేస్తోంది ప్రభుత్వం. ఇలా తనదైన మార్క్ చూపిస్తున్నారు పవన్. ఇక పంచాయతీరాజ్ శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామాలకు మరింత స్వేచ్ఛ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.
మరోవైపు జాతీయ స్థాయిలో కూడా పవన్ కల్యాణ్ పేరు మార్మోగిపోతోంది. ముఖ్యంగా తాజా మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎన్డీయే కూటమి తరపున ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. దీంతో మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ పేరు మార్మోగిపోతోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా పవన్ కల్యాణ్ సేవలను విస్తృతంగా వాడుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఢిల్లీకి వెళ్లిన పవన్ కల్యాణ్ కు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. కేంద్ర మంత్రులు సైతం పవన్ కల్యాణ్ కు ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు. ఒకప్పుడు ఫెయిల్యూర్ ముద్ర వేసుకున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు అవే నోళ్లతో శెభాష్ అనిపించుకునే స్థాయికి ఎదిగారు.