తిరుమల లడ్డు.. మళ్లీ మొదలు పెట్టిన పవన్..
గతంలో శ్రీవారి ప్రసాదానికి వినియోగించే లడ్డు తయారీలో కల్తీ నేతిని వాడినట్టు వచ్చిన ఆరోపణలు ఎటువంటి దుమారం సృష్టించాయో అందరికీ తెలుసు. ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్ట్.. కూటమి ప్రభుత్వానికి అక్షింతలు కూడా వేసింది. మరోపక్క సున్నితమైన ఇటువంటి విషయాలపై స్పష్టత లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదు అన్న చర్చ జాతీయస్థాయిలో సాగింది. ఇక తిరుమల లడ్డుకి వాడిన నేతి కల్తీ విషయంలో ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో రెస్పాండ్ అయ్యారు. సనాతన ధర్మం అంటూ.. ప్రాయశ్చిత్త దీక్షలు అంటూ పవన్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక ఈ విషయంపై దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సీట్) రంగంలోకి దింపారు.
కొంతకాలంగా కాస్త సైలెంట్ గా ఉన్న ఈ టీం సడన్గా కల్తీ నెయ్యి వ్యవహారంపై దూకుడు పెంచింది. ఇక తాజాగా ఈ విషయంపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు ప్రస్తావించిన పవన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పరమ పవిత్రమైన శ్రీవారి తిరుపతి లడ్డు ప్రసాదాల తయారీలో ఉపయోగించిన కల్తీ నెయ్యి వినియోగంపై వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది అని పవన్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న పవన్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. మొదటిసారి ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించినప్పుడు తాను తీవ్రమైన షాక్ కి గురయ్యానని పవన్ పేర్కొన్నారు. అంతేకాదు తన అన్నప్రాసన తిరుమలలోనే జరిగింది అన్న పాత విషయాన్ని మరొకసారి పవన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఇక అక్కడితో ఆగకుండా.. ఇదే విషయం క్రైస్తవులలో, లేక ముస్లింలలో జరిగి ఉంటే తీవ్రంగా స్పందించేవారు అని.. కానీ హిందువులలో ఆ స్థాయి స్పందన లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వక్ఫ్ బోర్డు మాదిరిగా హిందువులకు కూడా ఒక కామన్ బోర్డు ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఇటువంటి బోర్డు అవసరమని పేర్కొన్న పవన్ హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో పాటు ఎటువంటి దుమారాన్ని సృష్టిస్తాయో అర్థం కావడం లేదు.