Pawan in Kakinada Port: కాకినాడ పోర్టుకు భద్రత పెంచాలి.. అక్రమ రవాణా అరికట్టాలి.. డిప్యూటీ సీఎం
సామాన్యుడి ఆకలి తీర్చడానికి అందించే రేషన్ బియ్యం భారీగా దేశాలు తరలిపోతోంది అన్న విషయం మీకు తెలుసా? అవును కాకినాడలోని యాంకరేజ్ పోర్టు నుంచి ఈ రేషన్ బియ్యం భారీగా బయటకు వెళ్తున్న విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిప్పులు జరిగారు.. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం పేదవాడికి తక్కువ ధరకు బియ్యం అందించాలి అని రేషన్ బియ్యం పై కోట్ల రూపాయల ఖర్చు చేస్తుంటే ఇలా అక్రమంగా రవాణా జరుగుతుంది అని ఆయన అధికారులపై ఫైర్ అయ్యారు. వీటికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
రాష్ట్రంలో పేద ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతున్న నేపథ్యంలో.. ఓడలలోకి రేషన్ బియ్యం ఎవరు పంపిస్తున్నారు అని పవన్ ప్రశ్నించారు. నిజానికి రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో.. సముద్రం లోపల తొమ్మిది నాటికల్ మైళ్ల దూరంలో ఓ ఓడని గుర్తించారు. అందులో సుమారు 640 టన్నుల బియ్యం ఆఫ్రికా దేశాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నేడు స్వయంగా సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడారు.
ఈ నేపథ్యంలో అక్రమ రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నారు అంటూ అధికారులు, స్థానిక టిడిపి ఎమ్మెల్యే కొండా బాబు పై ఆయన ఫైర్ అయ్యారు. అంతేకాదు ఆ ఓడను సీజ్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్.. ప్రభుత్వం కేజీ రేషన్ బియ్యం కోసం సుమారు 43 రూపాయిలు ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు.. అయితే కొందరు వ్యాపారస్తులు ఈ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసి విదేశాలలో కిలోకి 73 రూపాయల చొప్పున అమ్ముతున్నారని తెలియజేశారు. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టుకు భద్రత పెంచే విధంగా కేంద్రమంత్రికి లేఖ రాసి చర్యలు చేపడతామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై త్వరలో విచారణ చేపట్టి నేరస్తులను శిక్షిస్తామని అన్నారు.