ASBL Koncept Ambience
facebook whatsapp X

Minister Anitha : హోంమంత్రి అనిత పనితీరుపై విమర్శలు..! తాజాగా పవన్ కల్యాణ్ కూడా..!!

Minister Anitha : హోంమంత్రి అనిత పనితీరుపై విమర్శలు..! తాజాగా పవన్ కల్యాణ్ కూడా..!!

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలు కావస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి కేబినెట్ లోనే వంగలపూడి అనితకు హోంమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. గత ఐదేళ్లపాటు అనితపై అనేక కేసులు నమోదయ్యాయి. అయినా ఆమె వెరవకుడా పోరాడింది. వాగ్ధాటి కావడం, జనంలోకి చొచ్చుకెళ్లే తెగువ ఉండడంతో తక్కువ కాలంలోనే పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నారు అనిత. పార్టీ అధికారంలోకి వస్తే అనితకు అందరూ మంత్రి పదవి ఖాయమనుకున్నారు. ఏకంగా హోంమంత్రిని చేశారు చంద్రబాబు. అయితే అనిత పనితీరు మాత్రం అంత బాగాలేదనే టాక్ వినిపిస్తోంది.

టీడీపీలో అనిత ఫైర్ బ్రాండ్ గా పేరొందారు. ఇక హోంమంత్రి పదవి దక్కడంతో ఆమె సత్తా చాటుతారని అందరూ భావించారు. అయితే మంత్రిహోదాలో అనిత పనితీరు మాత్రం గొప్పగా లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ ఐదు నెలల కాలంలో ఎంతోమంది అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగాయి. చాలా మంది హత్యకు గురయ్యారు. వీటిని అస్త్రాలుగా చేసుకుంది వైసీపీ. బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ఎలుగెత్తి చాటే ప్రయత్నం చేస్తోంది. ఆ తర్వాత హోంమంత్రి అనిత స్పందిస్తున్నారు. దీంతో తమ వల్లే అనిత రెస్పాండ్ అయ్యారని క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తోంది వైసీపీ.

వైసీపీ మాత్రమే కాదు.. టీడీపీలో కూడా కొంతమంది నేతలు కార్యకర్తలు మంత్రి అనిత తీరుపై సంతృప్తిగా లేరు. హోంమంత్రిగా ఉన్న అనిత చేతుల్లోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉంటాయి. ఆమె ఏదైనా చేయాలనుకుంటే క్షణాల్లో చేయొచ్చు. అయినా ఆమె మాత్రం యాక్టివ్ గా లేరని తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత ఐదేళ్లలో ఎంతోమంది తెలుగు తమ్ముళ్లపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడులు, దౌర్జన్యాలు చేశారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు కూటమి నేతలను టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వాటిపైన కూడా హోంమంత్రి చర్యలు తీసుకోవట్లేదు.

ఇప్పుడు హోంమంత్రి అనిత పనితీరుపై డిప్యూటీ హోంమినిస్టర్ పవన్ కల్యాణ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎంతోమంది అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే ఉంటే తాను హోంమంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అప్పుడు పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఇప్పటికే అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ కూడా ఇలా మాట్లాడడం అనితకు మరింత ఇబ్బందికరంగా మారింది. మరి ఇప్పటికైనా అనిత జులుం విదిలిస్తారో.. లేకుంటే ఇప్పటిలాగే వ్యవహరిస్తారో వేచి చూడాలి.

 

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :