సంక్షేమం సరే..ప్రచారమెక్కడ? తెలంగాణ కాంగ్రెస్ అంతర్మథనం
తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ పాలనను అంతం చేసి కాంగ్రెస్ పవర్ పగ్గాలు చేపట్టి దాదాపు ఏడాదవుతోంది. పరిపాలనా వారోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ చెప్పుకోదగిన పథకాలను అమలు చేస్తోంది కూడా. మేనిెపెస్టోలో పెట్టినట్లుగానే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రైతు రుణమాఫీ సహా పలు పథకాలను అమలు చేస్తూ ముందుకెళుతోంది. అయితే.. ఇంత జరుగుతున్నా క్షేత్రస్థాయిలో ప్రజల్లో మాత్రం ఆమేరకు క్రెడిట్ దక్కడం లేదన్నది కాంగ్రెస్ నేతల భావనగా కనిపిస్తోంది. రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాం కానీ చెప్పుకోలేకపోతున్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అన్నారు. గాంధీ భవన్ లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈవ్యాఖ్యలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో పేదవాడికి ఫలాలు అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని కేవలం ఏడాదిలోనే చేసి చూపించామన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే .. కాంగ్రెస్ ప్రభుత్వం 9 నెలల్లో 45వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసామన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించామన్నారు.200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు.
గ్యాస్ సిలిండర్ రూ. 500 కే ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాం కానీ చెప్పుకోలేకపోతున్నామన్నారు. ఎన్నికల సమయంలో గులాబీ పార్టీని గద్దెదించాలన్న కసితో పనిచేశారు కాంగ్రెస్ కేడర్. దీనికి తోడు సోషల్ మీడియాలోనూ అదేస్థాయిలో కేసీఆర్ టీమ్ పై ..కౌంటర్స్ వేశారు. ప్రజలు సైతం అప్పటికే కేసీఆర్ పదేళ్లపాలనపై వ్యతిేకతతో ఉండడంతో.. హస్తానికి ఓట్లు వేశారు. పవర్ చేతికొచ్చాక కాంగ్రెస్ శ్రేణులు, సైబర్ ఆర్మీ నిస్తేజంగా ఎందుకు మారిందా అన్న ఆలోచనలో పడింది కాంగ్రెస్ పార్టీ.