PAC: పీఏసీకి పెద్దిరెడ్డి పోటీ..! చంద్రబాబు చెప్పినందుకేనా...?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. దీంతో ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఆ హోదాకోసం వైసీపీ కోర్టును ఆశ్రయించింది. ఇంతలోనే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి నోటిఫికేషన్ ఇచ్చింది స్పీకర్ కార్యాలయం. వాస్తవానికి పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ. అయితే వైసీపీకి ఆ హోదా లేదు. అయినా వైసీపీ తరపున ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆ పదవి ఆయనకు దక్కుతుందా.. లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవి సహజంగా ప్రతిపక్షానికి కేటాయిస్తారు. ఇది కేబినెట్ ర్యాంక్ పదవి. అందుకోసమే ప్రతిపక్ష పార్టీ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటుంది. గతంలో టీడీపీ 23 సీట్లు సాధించినప్పుడు ఆ పార్టీ తరపున పయ్యావుల కేశవ్ నామినేషన్ దాఖలు చేశారు. సంప్రదాయం ప్రకారం ఆయనకే పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితులు వేరు. దాదాపు 20 మంది సభ్యుల మద్దతు ఉంటేనే పీఏసీ ఛైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంటుంది. కానీ వైసీపీకి కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అయినా ఈ పదవికోసం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
పీఏసీలో సహజంగా 12 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 9 మందిని శాసనసభ నుంచి, ముగ్గురిని శాసన మండలి నుంచి కేటాయిస్తారు. అయితే ఛైర్మన్ మాత్రం కచ్చితంగా అసెంబ్లీ సభ్యుడినే నియమిస్తారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అసెంబ్లీ సభ్యుడే కాబట్టి ఆయనకు ఆ అర్హత ఉంది. అయితే ఆ పదవిని దక్కించుకునేంత బలం మాత్రం ఆయనకు లేదు. అయినా పోటీ చేస్తున్నారంటే అందుకు ప్రభుత్వం అంగీకరించి ఉండాలి. ఇంకొకరు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో కచ్చితంగా ఆ పదవి పెద్దిరెడ్డికి దక్కే అవకాశం ఉంది. అయితే ఆ పార్టీకి తగినంతమంది సభ్యులు లేనందున తిరస్కరించే అధికారం స్పీకర్ కు ఉంటుంది.
అయితే పీఏసీ ఛైర్మన్ పదవి విషయంలో పంతాలకు పోకుండా కచ్చితంగా ప్రతిపక్షానికే ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అందుకే పెద్దిరెడ్డి నామినేషన్ వేసేనట్లు తెలుస్తోంది. తగినంత మంది సభ్యుల బలం లేకపోయినా సంప్రదాయానికి కట్టుబడి ప్రతిపక్షానికి పీఏసీ ఇస్తే బాగుంటుందని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. అందుకే పీఏసీ ఛైర్మన్ పదవిని పెద్దిరెడ్డికి ఇచ్చి మిగిలిన సభ్యులను కూటమి నుంచి నామినేట్ చేసే అవకాశం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చంద్రబాబుకు రహస్య స్నేహితుడని.. అందుకే వైసీపీకి బలం లేకపోయినా ఆయనకు పీఏసీ ఛైర్మన్ పదవి ఇస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.