ASBL Koncept Ambience
facebook whatsapp X

మేటి భారత్‌కు మీ సేవలు అవసరం

మేటి భారత్‌కు మీ సేవలు అవసరం

భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన విజయవంతమైంది. మూడు రోజుల పర్యటన సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో క్వాడ్‌ లీడర్స్‌ సమ్మిట్‌, సమ్మిట్‌ ఆన్‌ ది ఫ్యూచర్‌లో మోదీ పాల్గొన్నారు. దీంతో పాటు ఆయన తన పర్యటనలో కొన్ని ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలకు కూడా హాజరయ్యారు.   

న్యూయార్క్‌లో ఘన స్వాగతం... నిండిపోయిన హాలు

అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గౌరవార్థం న్యూయార్క్‌ లోని నాసౌ వెటరన్స్‌ కొలోజియం స్టేడియంలో జరిగిన  కార్యక్రమానికి ఆయన వచ్చినప్పుడు ఆట పాటలతో ఆయనకు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ఎన్నారైలు పాల్గొని మోదీకి జేజేలు పలికారు. ఇండో-అమెరికన్‌ కమ్యూనిటీ ఆఫ్‌ యూఎస్‌ఏ  ఆధ్వర్యంలో ‘మోదీ యూఎస్‌ ప్రోగ్రెస్‌ టుగెదర్‌’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘వికసిత భారత్‌ అంటే ‘పుష్ప’. ప్రోగ్రెసివ్‌, అన్‌స్టాపబుల్‌, స్పిరిచ్యువల్‌, హ్యుమానిటీ, ప్రాస్పరస్‌’’ అంటూ మోదీ కొత్త నిర్వచనమిచ్చారు. దీనికి సభికుల నుంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. అలాగే, ‘‘ఏఐ అంటే కూడా ఆస్పిరేషనల్‌ ఇండియా. ఏఐ అంటే అమెరికన్‌ ఇండియన్స్‌’’ అని కొత్త నిర్వచనాలిచ్చి ఎన్నారైలను మోదీ ఆకట్టుకున్నారు. శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో ఇతర దేశాలను భారత్‌ ముందుండి నడిపిస్తోంది’’ అని మోదీ అన్నారు. ఈ అద్భుత ప్రగతిలో విదేశాల్లోని భారతీయులది అత్యంత కీలక పాత్ర అంటూ కొనియాడారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని అభిప్రాయపడ్డారు.  అన్ని రంగాల్లోనూ ఇతరులను అనుసరించిన పాత రోజులను దాటుకుని గత పదేళ్లలో భారత్‌ ఎంతో ప్రగతి సాధించింది. ఇతర దేశాలకు మార్గదర్శకత్వం వహించే స్థాయికి చేరుకుంది. ప్రపంచ సారథిగా ఎదుగుతోంది. అవకాశాల ఇంకెంతమాత్రమూ కోసం ఎదురు చూడటం లేదు. అవకాశాలను సృష్టించుకుంటూ సాగుతోంది. అంతులేని అవకాశాలకు నెలవుగా భారత్‌ మారిందన్నారు.  ఈ నాసౌ వెటరన్స్‌ కొలోజియం స్టేడియంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్నారైలు పెద్దఎత్తున హాజరయ్యారు. 

న్యూయార్క్‌, పరిసర న్యూజెర్సీ నుంచేగాక మొత్తం 42 రాష్ట్రాలనుంచి 13,000 మందికి పైగా ఎన్నారైలు ఈ సభకు హాజరయ్యారు. సమావేశం ఆద్యంతం ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయన వేదికపైకి చేరుకున్న తర్వాత కూడా నిమిషాల పాటు కరతాళ ధ్వనులు ఆగకుండా కొనసాగాయి. అనంతరం మోదీ మాట్లాడుతూ వారి అభిమానం తనను కదిలించివేసిందన్నారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మన భారతీయులు నాపై ఇలా చెప్పలేనంతటి ఆదరాభిమానాలు, ఆప్యాయత కురిపిస్తూనే ఉన్నారు. దీనికి శాశ్వతంగా రుణపడిపోయాను’’ అని చెప్పారు. భారత, అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో ఇండియన్‌ అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మోదీ ప్రసంగం గంటా పది నిమిషాల పాటు సాగింది. 

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోందన్నారు. భారత ప్రగతి కోసం ఈసారి అత్యంత భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నట్టు చెప్పారు. ‘‘విధి నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. అనుకోకుండా గుజరాత్‌కు సీఎం అయ్యాను. ఆ రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు సేవలందించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించాను. తర్వాత దేశ ప్రజలు నన్ను ప్రధానిని చేసి మరింత పెద్ద బాధ్యత కట్టబెట్టారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘అధ్యక్షుడు జో బైడెన్‌  నన్ను దగ్గరుండి ఆహ్వానించి మరీ తన ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆయన చూపిన గౌరవం నన్నెంతగానో కదిలించింది. అది 140 కోట్ల పై చిలుకు భారతీయులకు దక్కిన గౌరవం. అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయులకు, వారి నిరంతర కృషికి దక్కిన గౌరవం’’ అన్నారు. 

అంతర్జాతీయంగా ఆధిపత్యం సాగించడం భారత అభిమతం కాదని మోదీ అన్నారు. అయితే ప్రపంచ ప్రగతిలో, శాంతి సాధనలో కీలక పాత్ర పోషించేందుకు మాత్రం ఎప్పుడూ ముందుంటుం దని స్పష్టం చేశారు. ‘అందరికీ సమ దూరం’ అన్నది పాత విధానం. ‘అందరితోనూ సమాన సాన్నిహిత్యం’ అన్నదే నవభారత నినాదం’ అని వివరించారు. ఇది యుద్ధాలకు సమయం కాదని పునరుద్ఘాటించారు. ‘‘భారత్‌ అంటే ఫైర్‌ కాదు.  ప్రపంచానికి వెలుగునిచ్చే సూరీడు’’ అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ అద్భుత ప్రగతి సాధిస్తూ దూసుకెళ్తోందని మోదీ అన్నారు. ఫలితంగా కేవలం రెండేళ్ల వ్యవధిలోనే భారత 5జీ మార్కెట్‌ అమెరికాను కూడా మించిపోయిందని వివరించారు. మేడిన్‌ ఇండియా 6జీ టెక్నాలజీపై కూడా భారత్‌లో పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ‘‘ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత మొబైల్‌ బ్రాండ్లన్నీ దాదాపుగా భారత్‌లోనే తయారవుతున్నాయి. భారత సెమీ కండక్టర్‌ చిప్‌లను అమెరికా దిగుమతి చేసుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. ప్రపంచమంతా మేడిన్‌ ఇండియా చిప్‌ల మీదే ఆధారపడి నడవనుంది. ఇది మోదీ గ్యారెంటీ’’ అన్నారు. 

అమెరికన్‌ టెక్‌ కంపెనీ సిఇఓలతో ప్రధాని భేటీ

గూగుల్‌, అడోబ్‌ సహా అమెరికన్‌ టెక్‌ కంపెనీల సీఈవోలతో ప్రధాని నరేంద్ర మోదీ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. న్యూయార్క్‌లోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ రౌండ్‌టేబుల్‌లో, సెమీకండక్టర్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటం కంప్యూటింగ్‌ మరియు బయోటెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాలలో సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు. భారత్‌ త్వరలో మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించనున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధిలో భాగమవ్వాలని, అవకాశాలను అందిపుచ్చుకో వాలని అమెరికన్‌ దిగ్గజ సంస్థల సీఈవోలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తాము అధికారం చేపట్టిన మూడో విడత కాలంలో (2024-29) భారత్‌ను భారీ ఎకానమీల్లో మూడో స్థానానికి చేర్చేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం 3.9 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌ తర్వాత భారత్‌ అయిదో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక, సాంకేతికత ప్రగతితో లభించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని కంపెనీలకు ప్రధాని సూచించారు. యావత్‌ ప్రపంచం కోసం ఉత్పత్తులు, సేవలను రూపొందించేందుకు, ఉత్పత్తి చేసేందుకు భారత్‌తో చేతులు కలపాలని ఆయన పేర్కొన్నారు. మేధోహక్కుల పరిరక్షణకు, టెక్నాలజీలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎల్రక్టానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, తయారీ, సెమీకండక్టర్లు తదితర విభాగాల్లో భారత్‌ సాధిస్తున్న పురోగతిని వివరించారు. ‘సెమీకండక్టర్ల తయారీకి గ్లోబల్‌ హబ్‌’గా భారత్‌ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు.

‘టెక్‌ సీఈవోలతో సమావేశం ఫలప్రదంగా జరిగింది. టెక్నాలజీ, నవకల్పనలు మొదలైన అంశాలు చర్చకు వచ్చాయి. ఆయా విభాగాల్లో భారత పురోగతిని వివరించాను’ అని ఎక్స్‌లో మోదీ పోస్ట్‌ చేశారు. మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) స్కూల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ నిర్వహించిన సమావేశంలో గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, ఎడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌, యాక్సెంచర్‌ సీఈవో జూలీ స్వీట్‌ తదితరులు పాల్గొన్నారు. కొత్త ఆవిష్కరణలకు అనుకూలమైన విధానాలతో భారత్‌, అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతోందని సీఈవోలు కితాబిచ్చారు. 

భారత్‌పై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు గూగుల్‌, ఎన్‌విడియా తదితర టెక్‌ దిగ్గజాలు వెల్లడిరచాయి. దేశీయంగా కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ వినియోగంపై ఫోకస్‌ పెట్టనున్నట్లు మోదీతో భేటీ అనంతరం సీఈవోలు తెలిపారు. డిజిటల్‌ ఇండియా విజన్‌ ద్వారా భారత్‌లో పరివర్తన తేవడంపై ప్రధాని దృష్టి పెట్టారని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. ‘హెల్త్‌కేర్‌, విద్య, వ్యవసాయం వంటి విభాగాల్లో వినూత్న సొల్యూషన్స్‌ రూపొందించాలని ఆయన సూచించారు. భారత్‌లో ఏఐపై భారీగా ఇన్వెస్ట్‌ చేస్తున్నాం. మరింతగా కలిసి పనిచేయడంపై ఆసక్తిగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. భారత్‌తో తమకు ఇప్పటికే వివిధ విభాగాల్లో భాగస్వామ్యం ఉందని, అధునాతన టెక్నాలజీ లను అందుబాటులోకి తెస్తున్నామని ఎన్‌విడియా సీఈవో జెన్సెన్‌ హువాంగ్‌ తెలిపారు.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :