RGV – Posani : నోటి దూల తెచ్చిన తంటా..! బయటపడేదెట్లా..!?
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు.. అలాగే ఒక్కసారి నోరు జారితే తిరిగి తీసుకోలేం.. దాని పర్యవసానాలు అనుభవించాల్సిందే.. అని చెప్తుంటారు పెద్దలు. అధికారం ఉందనో, పలుకుబడి ఉందనో, ఇంకెవరి అండదండలో చూసుకుని రెచ్చిపోయి నోటికి పని చెప్తే.. ఎప్పుడో ఒకసారి దాని ఫలితం అనుభవించక తప్పదని నిరూపిస్తున్నాయి ఏపీలో జరుగుతున్న పరిణామాలు. ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని గతంలో కారుకూతలు కూసిన వాళ్లందరూ ఇప్పుడు పోలీసుల శ్రీముఖాలు అందుకుంటున్నారు. దీంతో అలా నోరుజారిన వాళ్లంతా బెంబేలెత్తిపోతున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటుడు పోసాని కృష్ణ మురళి గతంలో చేసిన కామెంట్స్ కు ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
రామ్ గోపాల్ వర్మ గత ఐదేళ్లలో వైసీపీకి అండగా పనిచేశారనే విషయం అందరికీ తెలుసు. ఆ పార్టీకి అనుకూలంగా, టీడీపీ – జనసేనకు వ్యతిరేకంగా ఆయన అనేక సినిమాలు తీశారు. వాటిలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ను కించపరిచేలా పలు సన్నివేశాలు కూడా పెట్టారు. అయితే అవి సెన్సార్ ఆమోదం పొందడంతో వాటిపై చర్య తీసుకునే అధికారం పోలీసులకు లేదు. కానీ రామ్ గోపాల్ వర్మ అంతటితో ఆగలేదు. సోషల్ మీడియాలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, వాళ్ల కుటుంబసభ్యులను కించపరిచేలా పలు మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు. అలాగే తనదైన సెటైరికల్ ట్వీట్లతో రెచ్చిపోయారు. అంతేకాదు.. ప్రభుత్వం నుంచి ఆయన ప్రాజెక్టులకు తగిన పారితోషకం కూడా తీసుకున్నారనే ఆరోపణలున్నాయి.
ఇక.. పోసాని కృష్ణమురళి వైసీపీ నేత. ఆయన తన పార్టీకోసం అహర్నిశలూ శ్రమించారు. అందుకే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు జగన్. అయితే పోసాని కృష్ణమురళి నోరు జారితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఆయన అడపాదడపా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పై విరుచుకుపడుతంటారు. ఆ సమయంలో ఆయన బూతులు కూడా మాట్లాడేస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే అర్థముంది. ఇటీవల సెప్టెంబర్ నెలలో కూడా పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి పాలకులపై నోరు జారారు. దీంతో అతనిపై సీఐడీ కేసు నమోదు చేసింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాను ఇక రాజకీయాల జోలికి వెళ్లనని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. తనపై చర్యలు తీసుకుంటారని వర్మకు తెలుసు. అందుకే తెలివిగా పాలకులకు విష్ చేసి తప్పించుకున్నారు. అయితే తెలుగు తమ్ముళ్లు మాత్రం వర్మను వదల్లేదు. ఆయనపై పలుచోట్ల ఫిర్యాదులు చేసి కేసులు నమోదయ్యేలా చూశారు. అలాగే పోసాని కృష్ణమురళిపైన కూడా పలుచోట్ల కేసులు దాఖలయ్యాయి. అయితే అతనిపై సీఐడీ కేసు పైల్ చేయడమే ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు వీటని రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడింది. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటే మాత్రం వీళ్లను అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.