ASBL Koncept Ambience
facebook whatsapp X

చిక్కుల్లో వేణు స్వామి..!! కేసు నమోదు..??

చిక్కుల్లో వేణు స్వామి..!! కేసు నమోదు..??

మన సొసైటీలో జాతకాలను నమ్మేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ విషయంలో ఎవరి నమ్మకం వాళ్లది. ఎవరినీ కాదనలేం. అయితే ఈ జాతకాలను నమ్మేవాళ్లను ఆసరాగా చేసుకుని పలువురు జ్యోతిష్యులు పబ్బం గడుపుకుంటున్నారు. ఒకటో రెండో గాలివాటంగా నిజమైతే అదిగో.. నేను అప్పుడే చెప్పా.. నా జాతకం నిజమైంది అని ప్రమోట్ చేసుకుంటూ దోచేసుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో హడావుడి చేసి పబ్బం గడపుకోవడంలో వేణు స్వామి ముందుంటారు. తాజాగా ఆయన నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్లపై చెప్పిన జాతకంపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.

గతంలో నాగ చైతన్య – సమంత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వాళ్ల జాతకం సరిలేదని చాలా రోజులు కలిసి ఉండలేరని వేణు స్వామి చెప్పారు. వాళ్ల టైమ్ బాలేక విడిపోయారు. ఇక అప్పటి నుంచి తాను ముందే చెప్పా కదా అంటూ ప్రమోట్ చేసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు నాగ చైతన్య – శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇంతలోనే వీళ్ల జాతకంతో ముందుకొచ్చేశారు వేణు స్వామి. వీళ్లద్దరి టైమ్ కూడా బాగాలేదని.. 2027లో వీళ్లు కూడా విడిపోతారని చెప్పేశారు. అసలు పెళ్లి కూడా కాకముందే ఈ కారుకూతలేంట్రా బాబూ అని అందరూ వేణు స్వామిని దుమ్మెత్తి పోస్తున్నారు.

వేణుస్వామి గతంలో చెప్పిన అనేక జాతకాలు ఘోరంగా ఫెయిలయ్యాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ టైమ్ అస్సలు బాలేదు.. ఆయనతో సినిమాలు తీసేవాళ్లు సర్దేసుకోవాల్సిందే అన్నారు. కానీ కల్కితో ప్రభాస్ హిట్ కొట్టాడు. తెలంగాణలో కేసీఆర్ మళ్లీ గెలుస్తాడన్నారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి యోగం లేదన్నారు. కానీ రేవంత్ రెడ్డి గెలిచి సీఎం సీట్లో కూర్చున్నారు. ఏపీలో జగన్ కు తిరుగే లేదన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ నియోజకవర్గాల్లో గెలవడం కూడా కష్టమన్నారు. కానీ ఏమైంది జగన్ ఇంటికి పరిమితం కాగా చంద్రబాబు, పవన్ అధికారంలో ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వేణు స్వామి ఎన్నో జాతకాలు ఫెయిలయ్యాయి.

ఎన్నికల తర్వాత తన అంచనాలు తప్పయ్యాయి కాబట్టి ఇక జాతకాల జోలికి పోనని మాటిచ్చారు. కానీ నాగచైతన్య – శోభిత అంశంపై మళ్లీ నోరు విప్పడంతో వేణు స్వామిపై ట్రోలింగ్ విపరీతంగా నడుస్తోంది. అంతేకాక.. వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఈయన జాతకాలు చెప్పడమేంటని ఆయనపై ఫిర్యాదులు అందుతున్నాయి. తెలుగు సినిమా మహిళా జర్నలిస్టులు ఈ అంశంపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణు కూడా వేణు స్వామికి ఫోన్ చేసి ఆరా తీసినట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై ఎవరి జాతకాలు చెప్పబోనంటూ వేణు స్వామి మరో వీడియో విడుదల చేశారు. నోరు జారి ఇప్పుడు లెంపలేసుకుంటే ఏం లాభం..?

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :