Posani: రాజకీయాలకు పోసాని గుడ్ బై..! జ్ఞానోదయం అయిందా..?
అన్నీ బాగున్నప్పుడు అంతా బాగానే కనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో నోటికి ఏది వస్తే అదే కరెక్ట్ అని భావిస్తుంటాం. రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్జాయే వేరు. అప్పుడు మాట్లాడే మాటలు ఓ రేంజ్ లో ఉంటాయి. కన్నూమిన్నూ కానక నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంటారు. తమ మాటలను సమర్థించుకునేందుకు ఏవేవో లాజిక్ లు తెరపైకి తెస్తుంటారు. ఒకసారి ఆ అధికారం దూరమైతే వెంటనే వాస్తవమేంటో బోధపడుతుంది. అంతకాలం ఆకాశంలో విహరించిన వాళ్లంతా ఒక్కసారిగా భూమిపైకి దిగి వస్తారు. అప్పటి నుంచి ఆత్మావలోకనం చేసుకున్నట్టు.. తమకేమీ తెలియదన్నట్టు.. తమను మించిన అమాయకులు భూమిపై మరెవరూ లేరన్నట్టు వ్యవహరిస్తుంటారు.
ఇప్పుడు సినీ నటుడు, రాజకీయ నాయకుడు పోసాని కృష్ణ మురళి పరిస్థితి ఇదే. గత ఐదేళ్లూ వైఎస్సార కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలో ఉండేది. ఆ పార్టీకి ఆయన అనుకూలంగా ఉండేవారు. ఆ పార్టీకోసం ఎంతవరకైనా అన్నట్టు మాట్లాడేవారు. అందుకోసమే పార్టీకి ఆయన చేస్తున్న సేవలకు గానూ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు జగన్. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ పై విమర్శలకు పోసానిని ఒక ఆయుధంలా వాడుకుంది వైసీపీ. పోసాని కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయేవారు. సభ్యత, సంస్కారం మరిచి మాట్లాడేవారు. తల్లి, చెల్లి.. ఇలా ఎవర్నీ వదిలిపెట్టలేదు. వాడు.. వీడు అని బూతులతో విరుచుకుపడేవారు.
ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది. నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. నాడు నోటికి పని చెప్పిన నేతలపై విచ్చలవిడిగా కేసులు నమోదవుతున్నాయి. పోలీసులు ఒక్కొక్కరికీ నోటీసులు ఇస్తున్నారు.. అరెస్టు చేస్తున్నారు.. జైలుకు పంపిస్తున్నారు.. అలాగే పోసాని కృష్ణమురళి పైన కూడా పలుచోట్ల కేసులు దాఖలయ్యాయి. ఆయనపై ఏకంగా సీఐడీ కేసు పెట్టింది. పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్, బి.ఆర్.నాయుడు తదితరులపై పోసాని ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి దారుణ ఆరోపణలు చేశారు. వీటని సీరియస్ గా తీసుకున్న టీడీపీ, జనసేన నేతలు పోసానిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతున్నారు. ఈ పరంపర ఇంకా కొనసాగుతోంది. త్వరలోనే పోసానిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇంతలో పోసాని కృష్ణమురళి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇకపై తాను ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ మాట్లాడబోనని వెల్లడించారు. తనను చంద్రబాబు ఎంతో పొగిడారని.. ఆయన చేసేవి మంచి పనులని కొనియాడారు. ఆయన చేసే పనుల లిస్టు కూడా రాసుకున్నట్టు చెప్పారు. అలాగే తనకు మోడీ అంతే ఎంతో అభిమానమన్నారు. తనకు కరోనా వచ్చినప్పుడు లోకేశ్ ఆరా తీసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే జగన్ అంటే కూడా తనను చచ్చేంత ఇష్టమన్నారు. అయితే ఇకపై జగన్ గురించి కానీ, చంద్రబాబు గురించి కానీ మాట్లాడబోనన్నారు. జీవితాంతం ఇక రాజకీయాల గురించి మాట్లాడనని పోసాని స్పష్టం చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని... ఒకవేళ చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని వెల్లడించారు. మొత్తానికి పోసానికి జ్ఞానోదయం అయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.