ASBL Koncept Ambience
facebook whatsapp X

తానా 2025 మహాసభలకు సన్నాహాలు ప్రారంభం

తానా 2025 మహాసభలకు సన్నాహాలు ప్రారంభం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభల్లో భాగంగా వచ్చే సంవత్సరం 2025లో జరిగే మహాసభలను డిట్రాయిట్‌లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కాన్ఫరెన్స్‌కోసం టీమ్‌ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ మహాసభలకు కో ఆర్డినేటర్‌గా ఉదయ్‌ కుమార్‌ చాపలమడుగును నియమించారు. తానాతో ఎంతో అనుబంధం ఉన్న ఉదయ్‌ కుమార్‌ గతంలో జరిగిన తానా మహాసభల్లో ఇతర పదవుల్లో కీలకంగా వ్యవహరించడంతోపాటు వాటిని విజయవంతం చేసేందుకు ఎంతో కృషి చేశారు. డిట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ (డిటిఎ) కార్యనిర్వాహక కమిటీలో అనేక పదవులను ఉదయ్‌ కుమార్‌ నిర్వహించారు. ముఖ్యంగా, బాగా గుర్తింపు పొందిన డిటిఎ 25వ మరియు 40వ వార్షికోత్సవాల నిర్వహణలో కన్వీనర్‌ గా ఆయన చేసిన కృషి అందరి ప్రశంసలను అందుకుంది. 2005 డిట్రాయిట్‌ తానా ద్వైవార్షిక సదస్సుకు డిప్యూటీ కోఆర్డినేటర్‌ గా కూడా ఆయన సేవలందించారు. 2007లో తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్‌ గా కూడా ఆయన పనిచేశారు. ప్రముఖ నటుడు స్వర్గీయ తమ్మారెడ్డి చలపతిరావు గారి అల్లుడైన ఆయన, తన అద్భుతమైన ప్రసంగ నైపుణ్యాల ద్వారా తెలుగు ప్రజలలో విశేషంగా గుర్తింపు పొందారు. జూలై 2025 లో మెట్రో డెట్రాయిట్‌ లో జరగబోయే తానా 24వ ద్వైవార్షిక సదస్సుకు కోఆర్డినేటర్‌గా నియమితులైన వెంటనే ఆయన మహాసభలకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కాన్ఫరెన్స్‌ నిర్వహణకోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు.  

నోవి సబర్బన్‌ షో ప్లేస్‌లో మహాసభలు

డిట్రాయిట్‌లో జూలైలో నిర్వహించే తానా కాన్ఫరెన్స్‌ 2025కి రంగం సిద్ధమైంది. ఈ కాన్ఫరెన్స్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు కాన్ఫరెన్స్‌ కో ఆర్డినేటర్‌ ఉదయ్‌ కుమార్‌ చాపలమడుగు తెలిపారు.  నోవి సబర్బన్‌ షో ప్లేస్‌లో ఈ కాన్ఫరెన్స్‌ ను నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా డిట్రాయిట్‌ నగరంలో ఉన్న తానా నాయకులతో ఓ టీమ్‌ను ఏర్పాటు చేశామని, ఈ టీమ్‌లో ఉన్న వారంతా వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఉన్నవారని ఆయన చెప్పారు. తానా, డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ (డిటిఎ), శ్రీ వెంకటేశ్వర దేవాలయం, శ్రీ షిర్డీ సాయి సంస్థాన్‌ మరియు ఇండియా లీగ్‌ ఆఫ్‌ అమెరికాలో వారు నాయకులుగా ఉండి కార్యక్రమాలను సమర్థవం తంగా నిర్వహించారన్నారు. తానా 25వ, 40వ మహాసభల నిర్వహణలో కూడా కీలకపాత్ర పోషించా రని వారితో ఏర్పడిన ఈ టీమ్‌ ఈ కాన్ఫరెన్స్‌ను కూడా విజయవంతంగా చేస్తుందని, ఈ మహాసభలకు అవసరమైన బడ్జెట్‌ను, ప్లానింగ్‌ను ఈ టీమ్‌  సెప్టెంబర్‌ 2024 చివరి నాటికి పూర్తి చేసి నివేదికను అందిస్తుందన్నారు.  

డిట్రాయిట్‌లో 3వ సారి

ప్రతి పదేళ్ళకు ఓసారి డిట్రాయిట్లో మహాసభలు జరగడం ఆనవాయితీగా కనిపిస్తోంది. 2005, 2015 సంవత్సరంలో కూడా డిట్రాయిట్‌ లో తానా మహాసభలు జరిగిన విషయం విదితమే. ఇప్పుడు ఆ ఆనవాయితీకి కొనసాగింపుగా 2025లో మహాసభ లకు వేదికగా డిట్రాయిట్‌ నిలవడం విశేషం. డిట్రాయిట్‌ అయితే తెలుగు కమ్యూనిటీకి దగ్గరగా ఉంటుందని, వచ్చిన అతిధులకు వసతి సౌకర్యాలు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన తరువాత ఇసి, బోర్డ్‌ డిట్రాయిట్‌ ను ఎంపిక చేసినట్లు రాజా కసుకుర్తి తెలియజేశారు. ఈ తానా 2025 మహాసభలకు చైర్మన్‌గా గంగాధర్‌ నాదెళ్ళను కూడా నియమించారు. తానాలో పాతతరానికి, కొత్త తరానికి బాగా పరిచయం ఉన్న గంగాధర్‌ నాదెళ్ళ ఈ మహాసభలను కూడా పర్యవేక్షించనున్నారు. 

కాన్ఫరెన్స్‌ ప్రణాళిక కమిటీలో సభ్యులు వీరే...

*    గంగాధర్‌ నాదెళ్ల (చైర్మన్‌) - నిధుల సేకరణ
*    శ్రీనివాస్‌ కోనేరు (కెవికె) (కో-కోఆర్డినేటర్‌) ఆర్ధిక, ఆదాయ విభాగాలు 
*    సునీల్‌ పాంట్ర (కాన్ఫరెన్స్‌ డైరెక్టర్‌) సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు
*    కిరణ్‌ దుగ్గిరాల (కార్యదర్శి) ప్రణాళికా సమన్వయం 
*    జోగేశ్వరరావు పెద్దిబోయిన (కోశాధికారి) వేదిక, హోటళ్లు మరియు భోజన ఏర్పాట్లు
*    నీలిమ మన్నె (తానా ఉత్తర ప్రాంత ప్రతినిధి) పోటీలు, అలంకరణలు, మహిళలు, పిల్లల కార్యకలాపాలు.

కిక్‌ ఆఫ్‌ ఈవెంట్‌

తానా మహాసభల నిర్వహణలో భాగంగా అక్టోబర్‌ 19, 2024న కిక్‌ఆఫ్‌ ఈవెంట్‌ ను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు ఉదయ్‌కుమార్‌ చాపలమడుగు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌కు వాలంటీర్లుగా పనిచేయాలనుకునేవారు తానా నాయకులను సంప్రదించవచ్చని కూడా ఆయన చెప్పారు. వాలంటీర్లుగా పనిచేయాలనుకునేవారు ఈ కింది వెబ్‌ సైట్‌ ద్వారా కూడా తమ పేరు నమోదు చేసుకోవచ్చ ని ఆయన తెలిపారు.

www.tanaconference.org

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :