గయానా దేశాధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ
గయానాతో గట్టి బంధానికి పునాదులు వేశామని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్ ఇంధన భద్రతకు సంబంధించి భవిష్యత్తులో ఆ దేశం కీలక పాత్ర పోషించనుందని, దీర్ఘకాల ప్రయోజానాలను దృష్టిలో ఉంచుకొని కార్యాచరణను రూపొందించనున్నామని తెలిపారు. బ్రెజిల్ నుంచి గయానాలోని జార్జ్‌టౌన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ, ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య 10 రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. హైడ్రా కార్బన్స్, డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థలు, రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఫార్మా, వ్యవసాయం వంటి రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించాయి. భారత అధినేత ఒకరు గయానాలో పర్యటించడం 56 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
ద్వైపాక్షిక సమావేశానంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, గయానాల మధ్య మరింత సహకారం కోసం పలు రంగాలను గుర్తించామని ప్రధాని తెలిపారు. అంతర్జాతీయ అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తక్షణావసరమని ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పష్టం చేశారు. గయానాలోని ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని ఆయన అభినందించారు.