వయనాడ్ లో ప్రియాంక గాంధీ రికార్డ్ విక్టరీ..
రెండు దశాబ్దాల క్రితం గాంధీ – నెహ్రూ కుటుంబం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగి, గ్రాండ్ విక్టరీ సాధించారు.. కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో సమీప అభ్యర్థిపై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన స్థానంలో పోటీ చేసి విజయాన్ని నమోదు చేసుకున్నారు. రాహుల్ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని దాటేసి రికార్డ్ సృష్టించారు. ‘ప్రజా ప్రతినిధిగా ఈ ప్రయాణం కొత్తేమో కానీ.. ప్రజల తరఫున పోరాటం కొత్త కాదు అంటూ జనంలోకి దూసుకెళ్లారు ప్రియాంక. 30 ఏళ్లు గృహిణిగా పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయని ప్రియాంక, తాజాగా ప్రజా సమస్యలపైనా పోరాడేందుకు సిద్ధమయ్యారు. “నేనో ఫైటర్.. మీ తరఫున బలమైన గొంతుకనవుతా..” అని ఆమె చేసిన వ్యాఖ్యలే ప్రజలను ఆమె దగ్గరకు చేర్చాయి.
గాంధీ కుటుంబం నుంచి...
ప్రియాంక గాంధీ నెహ్రూ-గాంధీ కుటుంబంలో రాజకీయాల్లోకి వచ్చిన 10వ సభ్యురాలు. ప్రియాంక కంటే ముందు గాంధీ కుటుంబం నుంచి జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, మేనకా గాంధీ, వరుణ్ గాంధీ, రాహుల్ గాంధీలు రాజకీయాల్లోకి వచ్చారు. ప్రియాంక గాంధీ ఇప్పుడు తన రాజకీయాలను దేశంలోని దక్షిణ ప్రాంతం నుండి ప్రారంభించడం విశేషం. ప్రియాంక గాంధీకి రాజకీయ జీవితంలో ఇది మొదటి ఎన్నిక. ఇక్కడ ఆమె సీనియర్ సిపిఐ నాయకుడు సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌పై పోటీ చేశారు.
రాహుల్ గాంధీ తన మొదటి ఎన్నికల్లో 2004లో కాంగ్రెస్ సంప్రదాయ స్థానమైన అమేథీ నుంచి పోటీ చేశారు. అతను ఈ స్థానం నుండి మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. 2019 లో అతను అమేథీ, వాయనాడ్ నుండి ఎన్నికలలో పోటీ చేశారు. అతను అమేథీ నుండి ఓడిపోయారు. కానీ వయనాడ్ నుండి ఎన్నికలలో రికార్డు సంఖ్యలో ఓట్లతో గెలిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని రాయ్‌బరేలీ తోపాటు వాయనాడ్ లోక్‌సభ స్థానాల నుండి పోటీ చేసి రెండు స్థానాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
లోక్ సభకు ప్రియాంక...
2024 ఎన్నికల నాటికి ప్రధాని మోదీకి ధీటుగా సమాధానం ఇవ్వగల బలమైన నేతగా ప్రియాంక మారారు. మాటల మాంత్రికురాలిగా, వ్యూహకర్తగా, ప్రజలను ఆకర్షించే ప్రసంగాలతో ప్రచారంలో తనదైన ముద్ర వేశారు. ఈ క్రమంలోనే కేరళ వయనాడ్ ఉపఎన్నిక బరిలో నిలిచారు. తన సోదరుడు రాహుల్ గాంధీ 3.64 లక్షల ఓట్ల మెజార్టీని దాటేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు.