ASBL Koncept Ambience
facebook whatsapp X

వంద రోజుల పాలన ఎలా ఉంది..? రివ్యూకి సిద్ధమవుతున్న చంద్రబాబు..!?

వంద రోజుల పాలన ఎలా ఉంది..? రివ్యూకి సిద్ధమవుతున్న చంద్రబాబు..!?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించాయి. మూడు పార్టీల మధ్య సమన్వయంపై అనేక అనుమానాలుండేవి. అయితే వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ కనీవినీ ఎరుగని విజయాన్ని సాధించాయి. కేంద్రంలో కూడా వంద రోజులైన సందర్భంగా మోదీ సమీక్ష చేపట్టారు. వందరోజుల్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు ఇదే పని చేయబోతున్నారు.

రాష్ట్రంలో జున్ 12న చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది. సెప్టెంబర్ 22 నాటికి వంద రోజులవుతుంది. ఈ నేపథ్యంలో వంద రోజుల్లో అమలు చేసిన కార్యక్రమాలు, ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్.. లాంటి అనేక అంశాలపై ఆయన చర్చించాలనుకుంటున్నారు. మొదట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరితో చంద్రబాబు సమావేశం అవుతున్నట్టు తెలుస్తోంది. వంద రోజుల పరిపాలనపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందో వాళ్ల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. అదే సమయంలో పార్టీ నియమాలకు విరుద్ధంగా పని చేస్తూ చెడ్డపేరు తెస్తున్న ఎమ్మెల్యేలను హెచ్చరించేందుకు కూడా దీన్ని వేదికగా చేసుకోబోతున్నారని టాక్. ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవలికాలంలో చెడ్డపేరు తీసుకొచ్చారని నివేదికలున్నాయి. అందరి ముందూ వాళ్లను హెచ్చరించడం ద్వారా మిగిలిన వారంతా అలాంటి పనులు చేయకుండా ఉంటారనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం.

మరోవైపు వరదల కారణంగా దాదాపు 15 రోజులుగా ఇతరత్రా కార్యక్రమాలకు సమయం కేటాయించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో అమలు చేయాలనుకున్న పలు కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు రవాణా, విద్యాదీవెన.. లాంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. పెన్షన్లును మాత్రం దిగ్విజయంగా అమలు చేయగలిగింది. వీటన్నిటిపైనా రివ్యూ చేసి తదుపరి చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. అమలు చేసిన కార్యక్రమాలపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వ్యక్తమవుతోంది.. సంతృప్తిగా ఉన్నారా.. లేకుంటా ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తమవుతోందా.. అనే అంశాలపైన కూడా ఆరా తీయబోతున్నారు.

మరోవైపు జనసేన, బీజేపీలతో సమన్వయం ఎలా ఉంది.. ఎక్కడైనా ఏవైనా సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందా.. లాంటి అంశాలపైన కూడా చంద్రబాబు ఆరా తీయనున్నారు. ఐదేళ్లపాటు కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగుతుందని.. క్షేత్రస్థాయిలో కూడా మూడు పార్టీల నేతలు ఇదే సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఒక హామీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి చంద్రబాబు వంద రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ త్వరలోనే విడుదల కానుంది. 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :