Pushpa 2 : ఏపీలో పొలిటకల్ చిచ్చు పెడుతున్న పుష్ప 2 సినిమా..!?
ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పుష్ప 2 మూవీ రేపు విడుదలవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. సినిమా విడుదలకు ముందే వెయ్యి కోట్లు వసూలు చేసిందని టాక్ నడుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ సినిమా రాజకీయ రంగు పులుముకుంటోంది. అల్లు ఫ్యాన్స్ (Allu Fans) వర్సెస్ మెగా ఫ్యాన్స్ (Mega Fans) అన్నట్టు తయారైంది. అల్లు అర్జున్ కు వైసీపీ (YSRCP) మద్దతుగా ఉంటే మెగా ఫ్యాన్స్ అందరినీ జనసైనికులు (Janasena) ముందుండి నడిపిస్తున్నారు.
పుష్ప 2 సినిమా గురువారం భారీ అంచనాల మధ్య విడుదలవుతోంది. ఇందుకోసం అల్లు అబిమానులంతా థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కడుతున్నారు. రక్తాభిషేకాలు చేస్తున్నారు. బెనిఫిట్ షోలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. అటు తెలంగాణ, ఇటు ఏపీ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులిచ్చాయి. ఇందుకు అల్లు అర్జున్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు ధన్యవాదాలు కూడా తెలియజేశారు. అయినా అల్లు అర్జున్ పై జనసైనికుల ఆగ్రహం మాత్రం చల్లారినట్లు కనిపించట్లేదు. ఈ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఇది జనసైనికులకు ఆగ్రహం తెప్పించింది. అప్పటి నుంచి మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య కూడా గ్యాప్ ఏర్పడింది. ఇప్పటికీ అది అలాగే కంటిన్యూ అవుతోంది. ఎక్కడా కలిసి కనిపించట్లేదు. సహజంగా అల్లు ఫ్యామిలీ ఫంక్షన్ లో మెగా ఫ్యామిలీ.. మెగా ఫ్యామిలీలో ఏదైనా జరిగితే అల్లు ఫ్యామిలీ అటెండ్ కావడం సహజం. కానీ పుష్ప 2 ఈవెంట్లలో మెగా ఫ్యామిలీకి చెందిన ఒక్క వ్యక్తి కూడా పాల్గొన లేదు. పైగా పుష్ప 2 వేదికలపై అల్లు అర్జున్ ఎక్కడా మెగా హీరోల పేర్లు కూడా ప్రస్తావించలేదు. ఇది మెగా అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది.
అల్లు అర్జున్ యాటిట్యూడ్ పై జనసైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) లేకుండా అల్లు ఫ్యామిలీ ఉనికే ఉండేది కాదని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. చిరంజీవి కాళ్లు కడిగి నీళ్లు నెత్తిమీద చల్లుకోవాలని సూచిస్తున్నారు. అల్లు అర్జున్ కు ఇప్పటికే తాము హెచ్చరించామని.. అయినా ఆయనలో మార్పు కనిపించట్లేదన్నారు. అందుకే పుష్ప 2 సినిమాను జనసేన అడ్డుకుంటుందని బాహాటంగానే చెప్తున్నారు.
అయితే అల్లు అర్జున్ కు వైసీపీ నేతలు అండగా నిలుస్తున్నారు. ఈ సినిమాను దిగ్విజయం చేసే బాధ్యతను వాళ్లు తీసుకున్నారు. అల్లు అర్జున్, జగన్ తో ఉన్న ఫ్లెక్సీలను థియేటర్ల దగ్గర కడుతున్నారు. నాడు మాకు అండగా ఉన్నావని.. నేడు నీకు మేం అండగా ఉంటామని అల్లు అర్జున్ కు హామీ ఇస్తున్నారు. పుష్ప 2 సినిమాను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేస్తున్నారు. గతంలో జూ.ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని.. ఇప్పుడు కూడా భంగపాటు తప్పదని చెప్తున్నారు. మొత్తంగా ఏపీలో మాత్రం పుష్ప 2 సినిమా థియేటర్ల దగ్గర ఉద్రిక్తతలకు కారణమయ్యేలా ఉంది.