అదానీ వెనక మోడీ ఉన్నారా..? కాంగ్రెస్ విమర్శల పర్వం..
అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం.. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ అంశాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్.. మోడీని టార్గెట్ చేసినప్పుడల్లా అదానీ, అంబానీ అంటూ ప్రసంగిస్తారు కూడా. అలాంటి అదానీపై అమెరికాలో అవినీతి వ్యవహారంపై కేసు నమోదు కావడం.. హస్తానికి అందివచ్చిన అస్త్రంలా మారింది. ఇంకేముంది మరోసారి మోడీపైకి నేరుగా బాణాలు ఎక్కుపెట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాల్సిందేనని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
దేశంలో ముఖ్యమైన ప్రాజెక్టులు అదానీకే ఏ విధంగా దక్కుతాయని ఆయన ప్రశ్నించారు. ‘సెకీ ఒప్పందాల్లో జరిగిన అవినీతిని బయట పెట్టాలి. అదానీని అరెస్ట్ చేసి విచారిస్తే సెకీ అక్రమాలు వెలుగులోకి వస్తాయి. అదానీని అరెస్ట్ చేసే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా..?అని ప్రశ్నించారు. గౌతమ్ అదానీకి ప్రధాని మోడీ రక్షణ కవచంగా నిలిచారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అదానీ అవినీతి గురించి అమెరికాలో కేసు నమోదైందని గుర్తుచేశారు.
భారతదేశంలో కేసు నమోదు కాదని.. ఎందుకంటే అదానీ వెనక మోడీ ఉన్నారని ఆరోపణలు చేశారు అదానీ అరెస్ట్ అయితే ప్రధాని మోడీ అక్రమాలు బయటపడతాయి. అందుకే అదానీని మోడీ అరెస్ట్ చేయరు. అదానీ, మోడీ ఇద్దరూ ఒక్కటే. అదానీ విద్యుత్ ఒప్పందాల్లో అవినీతిపై అమెరికా కోర్టులో కేసులు కూడా పెట్టారు. దేశంలో మాత్రం ఏ కేసు లేవు అని’ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ‘గౌతమ్ అదానీ వెనక ప్రధాని మోడీ ఉన్నారని ఆరోపించారు రాహుల్. అదానీని మోడీ కాపాడుతున్నారు. చిన్న చిన్న దొంగతనాలు చేసే వారిపై మాత్రం కేసులు పెట్టి జైలుకు పంపుతారు. అదానీపై కేసులు పెట్టరు.అదానీ విద్యుత్ అవినీతిపై పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని స్పష్టం చేశారు కాంగ్రెస్ అగ్రనేత.