ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికలు : షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఉప ఎన్నికల సందడి మొదలైంది. వైసీపీ సభ్యులు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్.కృష్ణయ్య రాజీనామాలతో ఖాళీ అయిన 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 164 సీట్లలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలన్నా కనీసం 25 మంది ఎమ్మెల్యే మద్దతు అవసరం. ప్రస్తుతం వైసీపీ సంఖ్యాబలం 11 మాత్రమే. దీంతో ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న 3 స్థానాలకు కూటమి కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమైంది. అయితే ఈ 3 స్థానాలను టీడీపీ తీసుకుంటుందా? భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేనకు కూడా అవకాశం ఇస్తుందా? అనేదానిపై చర్చ జరుగుతోంది.