మెగా బ్రదర్ కు మెగా ఆఫర్ ఇస్తున్న కూటమి.. ఫలితం దక్కుతుందా?
ఆంధ్రాలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్ల కోసం ఉప ఎన్నికలు డిసెంబర్లో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్దల సభకు సంబంధించిన రాజకీయ హడావిడి జోరుగానే సాగుతోంది. వైసీపీ నుంచి బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకట రమణ, ఆర్ క్రిష్ణయ్య..ముగ్గురు ఎంపీలు రాజ్యసభకు రాజీనామా చేయడం తో ఇప్పుడు ఉప ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమ్ముడికి పట్టం కట్టడానికి ఎంతో కష్టపడ్డ మెగా బ్రదర్ నాగబాబుకి ఓ శుభవార్త వినిపిస్తోంది కూటమి ప్రభుత్వం. గతంలో 2024 ఎన్నికల నామినేషన్ సమయంలో అనకాపల్లి లోక్సభ నుంచి నాగబాబు పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది.అయితే కూటమిలో భాగంగా చివరి నిమిషంలో తన సీటుని నాగబాబు త్యాగం చేశారు. అప్పటి త్యాగానికి ఫలితంగా ఇప్పుడు రాజ్యసభ సీటు దక్కబోతోంది అని అందరూ అంటున్నారు. మొత్తం మూడు సీట్లలో కూటమి తరఫున ఒక సీటు జనసేనకే దక్కనుంది అని అందరూ భావిస్తున్నారు.
జనసేన నుంచి కచ్చితంగా ఆ సీటు కోసం నాగబాబుకి ప్రాముఖ్యత ఇస్తారు అన్న ప్రచారం సాగుతోంది. నాగబాబుని ఎప్పటికైనా ఢిల్లీ రాజకీయాలలో చూడాలి అనేదే పవన్ ఆలోచన అని టాక్. ఇక నాగబాబు విషయానికి వస్తే.. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడి కాంట్రవర్సీలో ఉన్నప్పటికీ మెగా అభిమానుల అండ నాగబాబుకి దండిగానే ఉంది. 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసిన సమయంలో కూడా నరసాపురం లోక్సభ సీట్ నుంచి బరిలోకి దిగిన నాగబాబు రెండున్నర లక్షల ఓట్ల దాకా రాబట్టాడు.
ప్రస్తుతం ప్రభంజనంలా ఏపీలో జనసేన ముందుకు పోతున్న నేపథ్యంలో.. నాగబాబుకి ఎంపీ అవడం పెద్ద కష్టమైన విషయం కాదు అనిపిస్తుంది. ఇక ఈ మూడు రాజ్యసభ సీట్లకు గాను డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. పోటీ ఉంటే ఎన్నికలు పెడతారు.. లేకపోతే గెలుపు ఏకగ్రీవమే అవుతుంది. మొత్తానికి నాగబాబు పెద్దల సభలోకి ఏకగ్రీవంగా వెళ్తాడా లేక ఎన్నికల్లో గెలిచి వెళ్తాడా అన్న విషయాన్ని చూడాలి.