Nagababu : రాజ్యసభకు నాగబాబు..! బీజేపీ ఒప్పుకుందా..?
ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల హడావుడి మొదలైంది. వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో వాళ్ల స్థానంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 10వ తేదీ నామినేషన్లు సమర్పించడానికి ఆఖరు తేదీ. 20వ తేదీన ఎన్నిక జరుగుతుంది. అదే రోజు లెక్కింపు ఉంటుంది. ప్రస్తుత బలాబలాలను బట్టి మూడు సీట్లను ఎన్డీయే కూటమే దక్కించుకోనుంది. అయితే ఇందులో ఓ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారనే టాక్ జోరుగా నడుస్తోంది.
వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి పలువురు బయటకు వస్తున్నారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య తమ పదవులకు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇప్పటికే టీడీపీలో చేరారు. ఆర్.కృష్ణయ్య బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. మోపిదేవి వెంకటరమణ రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు. బీద మస్తాన్ రావుకు మాత్రం మళ్లీ రాజ్యసభకు పంపించే అవకాశం ఉంది. ఆర్.కృష్ణయ్యను జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ ను చేసి.. ఆయన స్థానంలో బీజేపీ ఒకరిని రాజ్యసభకు పంపిస్తుందని అందరూ అనుకున్నారు.
అయితే ఇప్పుడు సమీకరణాలు మారుతున్నట్టు కనిపిస్తోంది. టీడీపీలో చేరిన ఇద్దరి స్థానంలో ఇద్దరిని టీడీపీ రాజ్యసభకు పంపించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆర్.కృష్ణయ్య స్థానాన్ని జనసేనకు కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి జనసేన తరపున నాగబాబు పోటీ చేయాలనుకున్నారు. అదే స్థానం నుంచి కొణతాల రామకృష్ణ పోటీ చేయాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో వీళ్లిద్దరినీ కాదని బీజేపీ తరపున సి.ఎం.రమేశ్ బరిలో దిగారు. అప్పుడు జనసేన ఈ స్థానాన్ని బీజేపీ కోసం త్యాగం చేసింది. రాజ్యసభ స్థానాన్ని జనసేనకు ఇస్తామని అప్పట్లో బీజేపీ మాటిచ్చింది.
పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ విషయంపై చర్చ జరిగినట్లు సమాచారం. నాడు జనసేన త్యాగానికి గుర్తుగా ఇప్పుడు రాజ్యసభ స్థానాన్ని వదులుకునేందుకు బీజేపీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆ స్థానం నుంచి నాగబాబును రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని సమాచారం. నాగబాబు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అనకాపల్లి సీటును వదులుకున్నారు. కాబట్టి రాజ్యసభకు పంపించేందుకు నాగబాబుకు అన్ని అర్హతలు ఉన్నాయని పార్టీ భావిస్తోంది. అందుకే బీజేపీతో చర్చల అనంతరం నాగబాబుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.