ASBL NSL Infratech
facebook whatsapp X

చంద్రబాబుపై రేవంత్ దూకుడే..!

చంద్రబాబుపై రేవంత్ దూకుడే..!

రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఇప్పటికీ అనేక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటి పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవట్లేదు. పైగా రెండు రాష్ట్రాలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయని కేంద్రం చెప్తోంది. దీంతో రెండు రాష్ట్రాలే వీటిని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఏర్పడింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కావడంతో కాస్త సుహృద్భావ వాతావరణం నెలకొంది. దీంతో సమస్యలు పరిష్కరించుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వాగతించారు. రెండు రాష్ట్రాల మధ్య మొదటి సమావేశం పూర్తయింది.

చంద్రబాబు, రేవంత్ మధ్య చర్చలు ఆసక్తికరంగా సాగాయి. రెండు రాష్ట్రాలు పంతాలకు పోవద్దని.. కమిటీల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు ఇరువురు నేతలు. అధికారుల కమిటీ, మంత్రుల కమిటీ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని డిసైడయ్యారు. అయితే చంద్రబాబు దిశానిర్దేశాల మేరకే రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారని.. వాళ్లిద్దరూ గురుశిష్యులని పలువురు తెలంగాణ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో సమస్యలు పక్కదారి పట్టి రాజకీయం తోడవుతోంది. ఇది కాంగ్రెస్ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే తనకు చంద్రబాబు గురువు కాదని.. ఇద్దరం సహచరులం మాత్రమేనని తేల్చి చెప్పారు. ఎవరైనా అలా గురుశిష్యులని పిలిస్తో చెంప పగలగొడ్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కొందరు మారట్లేదు. ఇప్పటికీ వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే కోణంలోనే చూస్తున్నారు. ఇక చంద్రబాబు ప్రజాభవన్ కు వచ్చిన సమయంలో ఆయనకు కాళోజీ రచించిన నాగొడవ పుస్తకాన్ని బహూకరించారు. తద్వారా తెలంగాణ ప్రయోజనాల పట్ల తన వైఖరి మారబోదని.. రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సమావేశంలో కూడా ఏపీ కంటే తెలంగాణ కోరిన కోరికలే ఎక్కువ. తెలంగాణ కోరికలను చూసి పలువురు నోరెళ్లబెట్టారు.

ఇక వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ కూడా చంద్రబాబు కూటమిపై విమర్శలు గుప్పించారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఒక్కటేనని.. ఎన్డీయే కూటమి ద్వారా ప్రయోజనం ఏమీ ఉండదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి పట్ల చంద్రబాబు కాస్త సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నా.. రేవంత్ రెడ్డి మాత్రం చంద్రబాబుపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే వీళ్లిద్దరి గత సంబంధాల దృష్ట్యా కొంతమంది వీళ్లపై ఆరోపణలు చేస్తూ ఉండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాస్త గట్టిగానే ఫైట్ చేస్తున్నట్టు అర్థమవుతోంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :