ASBL NSL Infratech
facebook whatsapp X

సభలోనూ ఆదిపత్యపోరాటమేనా..?

సభలోనూ ఆదిపత్యపోరాటమేనా..?

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కాస్తా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆధిపత్యపోరుకు అడ్డాగా మారాయి. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపించారంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం కాస్తా.. ఈ వాగ్వాదానికి వేదికైంది. అయితే ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ... మోడీ సర్కార్ తీరుపై దండెత్తుతూనే, బీఆర్ఎస్ ను ఇరకాటంలోకి పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ధీటుగా కౌంటరిచ్చే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కీలక చర్చకు కేసీఆర్ గైర్హాజర్ కావడంపై సీఎం రేవంత్ ప్రశ్నించగా.. ఆయనక్కర్లేదు..తమకు సమాధానం చెబితే చాలన్నారు కేటీఆర్.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి... తానేమి తండ్రి తెచ్చి కూర్చోపెడితే సీఎం సీటులో కూర్చోలేదంటూ నేరుగా సెటైర్ వేశారు. కష్టపడి , రాజకీయాల్లో పైకొచ్చి.. ఈసీట్లో కూర్చున్నానన్నారు. మేనేజ్ మెంట్ కోటా అనుకున్నానని.. అంతకన్నా దారుణమంటూ సెటైర్ వేశారు. దీంతో కేటీఆర్ కూడా అదేస్థాయిలో కౌంటరిచ్చారు. తాము కూడా సీఎం సీటును పేమెంట్ కోటాలో తెచ్చుకున్నారనొచ్చంటూనే బదులిచ్చారు. ఇక ప్రధానమంత్రి మోడీ సేవలో మీరు తరించారంటే.. కాదు మీరు తరించారంటూ ఇరుపార్టీల నేతలు గట్టిగానే చేసుకున్నారు. గతంలో పీఎం రాష్ట్రానికి వచ్చినప్పుడు , వారితో స ఖ్యతగా ఉండేందుకు ప్రయత్నించామని.. చాలా సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రసమస్యలపై ప్రజెంటేషన్లు ఇచ్చామని గుర్తు చేశారు రేవంత్. కానీ.. వారు మాత్రం రాష్ట్రంపై కక్షతో వ్యవహరిస్తున్నారన్నారు.

మరోవైపు.. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేసీఆర్ మాట్లాడలేదని , కనీసం సభకు కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. అయితే..తమ పదేళ్ల పాలనలో అంశాల వారీగా మద్దతిచ్చామన్నారు కేటీఆర్. ఇప్పటికైనా కేంద్రం వ్యవహారశైలి ఎలా ఉంటుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమైందనుకుంటా అంటూ చురకలు వేశారు. అయితే.. అందరం ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేద్దామంటూ.. సీఎం రేవంత్ ప్రకటనను బీఆర్ఎస్ స్వాగతించింది. అయితే ఇందులో కూడా ఇరుపార్టీలు రాజకీయం చేశాయి. తమతో పాటు కేసీఆర్ రావాలని సీఎం రేవంత్ కోరగా.. అక్కర్లేదు మీరు చేయండి మేం మద్దతుగా ఉంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌంటరిచ్చారు.మొత్తం సభను చూసిన సగటు తెలంగాణ పౌరుడు... మళ్లీ ఆసక్తికరంగా రాజకీయాలు జరిగాయని అనుకోవడం జరిగిందని చెప్పొచ్చు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :