సముద్రాన్ని శోధించే మత్స్య 6000... 12 గంటల్లో డీప్ సీ యాత్ర
సముద్రాన్ని శోధించాలని.. నిక్షిప్తమైన అగాధ రహస్యాలను వెలికితీసి అధ్యయనం చేయాలన్న సంకల్పంతో భారత్ అడుగులు వడివడిగా ముందుకేస్తోంది. దీనిలో భాగంగా సముద్రాణ్వేషణలో సత్తా చాటుతోంది.' సముద్రయాన్' ప్రాజెక్టుతో సత్తా చాటుతోంది.ఈ ప్రాజెక్టులో భాగంగా సముద్రంలోని 6,000 మీటర్ల లోతుకు వెళ్లి, 12 గంటల సమయం గడిపి తిరిగి రాగలిగే ప్రత్యేక 'మత్స్య-6000' అనే డైవింగ్ మెషీన్‌ను సిద్దం చేసింది. ఈ ప్రత్యేక ఉపకరణం సిబ్బంది భద్రత, అత్యవసర పరిస్థితుల్లో తట్టుకొనేలా రూపొందించారు. దీనికి అవసరమైన ప్రత్యేక ఆహారాన్ని డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. మత్స్య-6000 అత్యవసర పరిస్థితుల్లో కూడా 96 గంటలపాటు సిబ్బంది ఉండేలా రూపొందించారు. ఇందుకోసం 67 ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉంటాయి.
ఈ సబ్‌మెర్సిబుల్ 108 గంటలపాటు పనిచేయగలదు.3 గంటల్లో సముద్రగర్భానికి వెళ్లి, మరో 3 గంటల్లో పైకి వచ్చి, 6 గంటలపాటు లోతైన సముద్రంలో పరిశోధన చేసే విధంగా డిజైన్ చేశారు.6,000 మీటర్ల లోతులో 'మత్స్య'పై ఒత్తిడి 596 రెట్లు ఉంటుంది.ఇది సుమారు 1,848 ఏనుగుల బరువుతో సమానం. ఈ గణాంకం అనుసరించి దాని నిర్మాణం కోసం టైటాన్ అలాయ్ వాడారు. ఇది దాదాపు 600 రెట్ల నీటి ఒత్తిడిని తట్టుకోగలదు. ఈ సిస్టమ్ ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సిద్ధం చేసింది.
సముద్రం లోతుకు వెళ్లే కొద్దీ సవాళ్లు ఎదురవుతాయి. అక్కడ కాంతి వందమీటర్లకు మించి ప్రసరించే అవకాశం లేకపోవడంతో మొత్తం చీకటిగా ఉంటుంది. దీనికి తోడు కమ్యూనికేషన్ల కోసం వాడే ఎలక్ట్రో మాగ్నెట్ వేవ్స్ కూడా ఇక్కడ పనిచేయవు. దీంతో శబ్ధతరంగాల కమ్యూనికేషన్లపైనే ఆధారపడాలి. ఈప్రాంతంలో తరంగాలు చాలా నెమ్మదిగా ప్రయాణిస్తాయి. ఫలితంగా అత్యవసర సమయాల్లో పైన ఉండే షిప్ కు సిగ్నల్స్ పంపడం చాలా కఠినమైన విషయమని చెప్పాలి.
'సాగర్‌నిధి' నౌక సాయంతో మత్స్య-6000 ప్రయాణం
మత్స్య-6000 ప్రయాణం సాగర్‌నిధి అనే రీసెర్చ్ నౌక ద్వారా సాగుతుంది. ఈ నౌక సముద్ర జలాల్లో డీప్‌సీ మెషీన్‌కు సహకరిస్తుంది. ఈ యంత్రం సముద్రగర్భంలోని కెమోసింథటిక్ జీవాలు, మీథేన్ నిల్వలు, హైడ్రోథర్మల్ వెంట్స్ వంటి అంశాలపై అధ్యయనం చేయనుంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, భారత్ సముద్రలోతుల్లో పరిశోధన సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా వంటి దేశాల సరసన చేరుతుంది. సముద్రయాన్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం దాదాపు రూ.4,077 కోట్లు వెచ్చించింది. దీని విజయం దేశంలోని డీప్ సీ పరిశ్రమల అభివృద్ధికి దోహదం కానుంది.