Kakinada Port : కాకినాడ పోర్టును అందుకోసమే లాక్కున్నారా..? తెరవెనుక ఏం జరిగింది..?
కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం సీజ్ వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. దీని వెనుక ఎవరున్నారో అంతు తేల్చాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధికారులను ఆదేశించారు. దీని మూలాలను కనిపెట్టి చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే సమయంలో తమ నుంచి కాకినాడ పోర్టును (Kakinada Port), కాకినాడ సెజ్ (Kakinada SEZ) ను గత ప్రభుత్వ పెద్దలు అక్రమంగా లాక్కున్నారంటూ సీఐడీకి (CID) ఓ ఫిర్యాదు నమోదైంది. కాకినాడ పోర్టు చేతులు మారిన తర్వాతే బియ్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతోందనే ఆరోపణలున్నాయి. దీంతో పోర్టు చేతులు మారడంతో పాటు బియ్యం అక్రమ రవాణా చేస్తున్న పెద్దలను కనిపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్ లోని కీలకమైన పోర్టుల్లో కాకినాడ ఒకటి. గతంలో ఈ పోర్టు జీఎంఆర్ (GMR) తో పాటు కేవీ రావు (KV Rao) చేతుల్లో ఉండేది. అయితే జగన్ (YS Jagan) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చేతులు మారింది. ఈ బదలాయింపు వెనుక అనేక అక్రమాలు జరిగినట్లు ఇటీవల వెల్లడైంది. తన నుంచి అక్రమంగా కాకినాడ పోర్టును, కాకినాడ సెజ్ ను అరబిందో రియాలిటీ (Auro Realty) లాగేసుకుందంటూ సీఐడీకి కేవీ రావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో అనేక విషయాలను ఆయన వెల్లడించారు. ఇవి విస్తుపోయేలా ఉన్నాయి.
కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో కేవీ రావుకు 41.12 శాతం వాటా ఉండేది. దీని విలువ సుమారు 2500 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే కాకినాడ సెజ్ లో కేవీ రావు వాటా 48.74శాతం. దీని విలువ 1109కోట్లు అని అంచనా. వీటిని ఎలాగైనా లాక్కోవాలని భావించిన నాటి ప్రభుత్వ పెద్దలు పెద్ద స్కెచ్చే వేశారు. 2020 మేలో కేవీ రావుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) ఫోన్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డిని (YV Vikranth Reddy) కలవాలని.. ఆ సమావేశంలో అరబిందో శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy) కూడా ఉంటారని వెల్లడించారు.
విజయసాయి రెడ్డి చెప్పిన మేరకు కేవీ రావు.. హైదరాబాద్ లో విక్రాంత్ రెడ్డిని కలిశారు. ఆ సమావేశంలో విక్రాంత్ రెడ్డి పలు అంశాలను కేవీ రావు దృష్టికి తీసుకెళ్లారు. కాకినాడ పోర్టు స్థూల రాబడిలో 22 శాతం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి ఎంతమొత్తం రావాలో శ్రీధర్ అండ్ సంతానం కంపెనీతో ఆడిట్ చేయిస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం కొన్ని రోజుల తర్వాత రూ.965 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పోర్టు బకాయి పడినట్లు నివేదిక రూపొందించారు. అంత సొమ్ము చెల్లిస్తే మీరు కంపెనీ మూసేయాల్సి వస్తుందని కూడా సలహా ఇచ్చారు. అందుకే తాము చెప్పినట్లు వినాలని సూచించారు.
పోర్టులో, సెజ్ లో మీకున్న వాటాలను తాము చెప్పిన వాళ్లకు బదలాయించాలని హుకుం జారీ చేశారు. లేకుంటే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. పోర్టును రూ.494 కోట్లకు, సెజ్ ను రూ.12 కోట్లకు అరబిందో రియాల్టికీ బదలాయిస్తూ ఒప్పందాలు సిద్ధం చేశారు. వాటిపై సంతకాలు చేయాలని బలవంతం చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. 2500 కోట్ల విలువైన వాటాని 494 కోట్లకు, 1109 కోట్ల విలువైన వాటాను 12 కోట్లకు బదలాయించుకోవడం సరికాదని విక్రాంత్ రెడ్డికి కేవీ రావు అభ్యంతరం తెలిపారు. అయితే చట్టబద్దంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మాత్రం సొమ్ము ఇస్తున్నట్టు విక్రాంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో కేవీ రావు సంతకాలు చేయక తప్పలేదు.
ఈ తతంగమంతా ముగిసిన తర్వాత కేవీ రావును నాటి సీఎం జగన్ దగ్గరికి తీసుకెళ్లారు విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రా రెడ్డి. తనకు జరిగిన అన్యాయాన్ని జగన్ కు వివరించేందుకు కేవీ రావు ప్రయత్నించారు. అయితే తనకేమీ చెప్పొద్దని.. విక్రాంత్ రెడ్డి చెప్పినట్లు చేయాలని జగన్ తేల్చి చెప్పారు. దీంతో ఇదంతా జగన్ కనుసన్నల్లోనే నడుస్తోందని తనకు అర్థమైనట్లు కేవీ రావు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కేవీరావు విజ్ఞప్తి చేశారు. మొత్తంగా కాకినాడ పోర్టు చేతులు మారడం వెనుక పెద్ద తతంగమే నడిచినట్లు కేవీ రావు ఫిర్యాదును బట్టి అర్థమవుతోంది.