మట్టికరిచిన మరాఠా రాజకీయ యోథుడు శరద్ పవార్ ..
పవార్, భారత రాజకీయయవనికపై ఉన్న ప్రముఖ నేతల్లో ఒకరు . ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయరంగంలో చక్రం తిప్పారు పవార్. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వ్యవస్థాపకుడు, పవార్ మహారాష్ట్ర రాజకీయాలను ఔపోసన పట్టిన శరద్ పవార్..దశాబ్దాల పాటు జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్రపోషించారు. 1967లో మొదటిసారిగా 27 సంవత్సరాల వయస్సులో బారామతి నియోజకవర్గానికి శరద్ పవార్ ప్రాతినిథ్యం వహించారు. అంచెలంచెలుగా ఎదిగారు.. నాలుగు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. కేంద్ర కేబినెట్లలో కీలక శాఖలు నిర్వహించారు.
84 ఏళ్ల వయసులో పార్టీ చీలిక తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో శరద్ పవార్ మహారాష్ట్రను క్లీన్ స్వీప్ చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అప్పట్లో మంచి విజయం సాధించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ విజయాన్ని నిలబెట్టుకోలేకపోయారు.అసెంబ్లీ ఎన్నికల్లో శరద్‌పవార్ పార్టీ కేవలం 13 స్థానాల్లో మాత్రమే గెలుపొందడం పరిస్థితికి అద్దం పడుతోంది. మరోవైపు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ.. మంచి విజయం సాధించింది. దీన్ని బట్టి ప్రజలు పవార్ వారసుడిగా అజిత్ ను గుర్తించారని భావించవచ్చు. బారామతి అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్‌కు వ్యతిరేకంగా శరద్ పవార్ అజిత్ పవార్ మేనల్లుడు యుగేంద్ర పవార్‌ను బరిలోకి దింపారు. కానీ అజిత్ పవార్‌కే బారామతి ఓటర్లు ప్రాధాన్యత ఇచ్చారు.దీనికి తోడు గుర్తు కోల్పోవడం కూడా పెద్ద దెబ్బగా చెప్పొచ్చు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని, తాను పార్లమెంటరీ రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. బారామతిలో ఒక సభలో ప్రసంగించిన పవార్, రాజ్యసభలో తన ప్రస్తుత పదవీకాలం దాదాపు 18 నెలలు మిగిలి ఉందని, అతను తిరిగి ఎన్నిక చేయకూడదనుకుంటున్నట్లు ప్రకటించారు. ఇది కూడా మరాఠా ప్రజలు, ముఖ్యంగా ఎ్సీపీ అభిమానుల్లో మార్పును తెచ్చిందని భావించవచ్చు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఓడి ఉండొచ్చు గాక.. కానీ మరాఠాల గుండెల్లో మాత్రం శరద్ నిలిచే ఉంటారు.
ఎందుకంటే.. శరద్ పవార్... ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచిన వ్యక్తి. మరాఠాల రాజకీయ వైభవానికి చిహ్నంగా చెప్పొచ్చు.అయితే.. ఆయనపై వయోభారం ప్రభావం చూపుతోంది. రాజకీయంగా విభేదించవచ్చు కానీ.. అజిత్ పవార్ కు కూడా శరద్ పై అంతులేని గౌరవముంది. అజిత్ వరకూ ఎందుకు.. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు శరద్ అంటే భక్తి, ప్రపత్తులు ప్రదర్శిస్తారు కూాడా. అయితే శరద్ పవార్ స్థానాన్ని భర్తీ చేయడం మాత్రం మిగిలిన వారికి సాధ్యం కాదు. ముఖ్యంగా శరద్ కుమార్తె.. సుప్రియా సూలేకు ఇది తలకు మించిన భారమే. ఆ అనుమానంతోనే ప్రజలు కాస్త సీనియర్ అయిన అజిత్ వైపు నిలిచారన్నది ఓ విశ్లేషణ.