ASBL NSL Infratech
facebook whatsapp X

ఆగస్ట్ 9న రాబోతోన్న ‘సింబా’ అందరినీ మెప్పిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంపత్ నంది

ఆగస్ట్ 9న రాబోతోన్న ‘సింబా’ అందరినీ మెప్పిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సంపత్ నంది

అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది అందించిన  ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్యే విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

సంపత్ నంది మాట్లాడుతూ.. ‘ఈ మూవీ మొదలవ్వడానికి కారణం ఉదయభాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఉదయభాను నన్ను ఛాలెంజ్ చేసింది. ఆ తరువాత సంతోష్ గారు, కేసీఆర్ గారు తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకున్నా. అలాంటి టైంలోనే ఈ కథ విన్నా. అందరికీ కనువిప్పు కలిగేలా, ఎంటర్టైన్ చేసేలా, మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది. నేను మా నిర్మాత రాజేందర్ రెడ్డికి మంచి మాస్ కమర్షియల్ కథలు చెప్పా.. లాభాలు వస్తాయని చెప్పా. కానీ మా నిర్మాత మాత్రం సింబా కథను ఎంచుకున్నారు. సమాజానికి మంచి చేయాలనే, ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రం చేశారు. అలాంటి మంచి వ్యక్తి కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. సినిమా నిర్మాణంలో సాయం చేసిన పూర్ణ, రాఘవ గారికి థాంక్స్. సైంటిఫిక్‌గా హెల్ప్ చేసిన కిషోర్ గారికి, స్క్రిప్ట్ ఐడియా ఇచ్చిన విజయ్ గారికి థాంక్స్. ఈ చిత్రం ఆగస్ట్ 9న రాబోతోంది. ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు. అందరినీ మెప్పిస్తుంది. ఈ సినిమాను చూస్తే వందకు వంద మార్కులు వేస్తారు’ అని అన్నారు.

మురళీ మనోహర్ మాట్లాడుతూ.. ‘సింబా చాలా కొత్త కథ, కొత్త పాయింట్‌తో రాబోతోంది. సంపత్ నంది గారు అద్భుతంగా కథ రాశారు. నేను దర్శకత్వం వహించాను. ఇంత మంచి ప్రాజెక్ట్‌ను రాజేందర్ గారు నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఆయన విజన్‌కు హ్యాట్సాఫ్. ఎల్లప్పుడూ మా వెంట ఉండి సహకారం అందించారు. నాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన నా ఫ్యామిలీకి థాంక్స్. జగపతి బాబు గారి డెడికేషన్ చూసి నేను ఇన్ స్పైర్ అయ్యాను. అనసూయ గారి నటన చూసి షాక్ అయ్యాను. నాకు సహకరించిన టీంకు థాంక్స్. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

నిర్మాత రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వనజీవి రామయ్య గారు కోటికి పైగా మొక్కలు నాటారు. స్కూల్ పుస్తకాల్లో వీరి మీద పాఠాలున్నాయి. వీళ్లని చూసి ఇన్‌స్పైర్ అయి ఈ కథను రాసుకున్నాం. ప్రకృతి లేకపోతే మనం ఉండలేం. ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. మా గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టబోతోన్నాం. ఆగస్ట్ 22న చిరంజీవి గారికి పుట్టిన రోజున కొన్ని వేల మొక్కల్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మా సినిమా నుంచే లాభాల్ని కూడా మొక్కల రూపంలోనే ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాం. మా కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇండియన్ స్క్రీన్ మీద సినిమా రాలేదు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

అనసూయ మాట్లాడుతూ.. ‘ఆడియెన్స్ ప్రశంసలు, అభిమానం వల్లే నేను ఇలాంటి చిత్రాలు చేయగలుగుతున్నాను. సింబా అందరినీ ఆకట్టుకుంటుంది. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన సంపత్ నంది గారికి, మురళీ గారికి, రాజేందర్ గారికి థాంక్స్. ఇంత మంచి టీంతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. కస్తూరీ మేడం, గౌతమి మేడం, జగపతి బాబు వంటి వారితో నటించడం ఆనందంగా ఉంది. డీఓపీ గారు మా అందరినీ చక్కగా చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మంచి ఆర్ఆర్, పాటలు ఇచ్చారు. మా ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మీ అందరినీ గర్వపడేలాంటి పాత్రలే చేస్తాను. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

జగపతి బాబు మాట్లాడుతూ.. ‘సింబా అనేది డాక్యుమెంటరి కాదు. వృక్షంతో కనెక్ట్ చేసి తీసిన చిత్రం. ఈ కాన్సెప్ట్ అందరికీ నచ్చుతుంది. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ‘సినిమా ఈవెంట్‌కు వచ్చాం.. వెళ్లాం.. అని కాకుండా.. అందరూ మొక్కలు నాటండి. రాజేందర్ గారు మంచి సందేశాన్నిచ్చే చిత్రాన్ని తీశారు. ఇలాంటి చిత్రాలు పెద్ద సక్సెస్ అవ్వాలి. సింబా సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

భానుచందర్ మాట్లాడుతూ.. ‘రాజేందర్ నాకు మిత్రుడు. కమర్షియల్ గురించి ఆలోచించకుండా ఇంత మంచి సందేశంతో ఉన్న సినిమాను నిర్మించిన నా మిత్రుడు రాజేందర్‌కు ఆల్ ది బెస్ట్. కేవలం సందేశం కాకుండానే ఇంకా ఏదో ఉందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ట్రైలర్ చూస్తే సినిమాను చూడాలన్న ఆసక్తి ఏర్పడింది. ఆగస్ట్ 9న ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ.. ‘సంపత్ నంది ఈ స్థాయికి ఎదగడం మాకు గర్వంగా ఉంది. రాజేందర్ రెడ్డి, సంపత్ నంది కలిసి ఇంత మంచి చిత్రాన్ని నిర్మించారు. ప్రకృతి గొప్పదనం చెప్పేలా, ప్రకృతి పరిరక్షణ గురించి చెప్పేలా తీసిన ఈ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలి. ప్రభుత్వాలు ఈ గ్రీన్ ఛాలెంజ్, హరితహారం అనే కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ చిత్రం పెద్ద హిట్ నిర్మాతలకు లాభాలు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘మా ప్రాంతానికి చెందిన రాజేందర్ ఇంత మంచి చిత్రాన్ని నిర్మించినందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అయి మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. మంచి సందేశంతో రాబోతోన్న ఈ చిత్రంలో నటించిన అందరికీ ఆల్ ది బెస్ట్. వృక్షో రక్షితి రక్షిత: అనే సూక్తిని అందరూ పాటించాలి’ అని అన్నారు.

సమ్మి రెడ్డి మాట్లాడుతూ.. ‘మా ఊరి నుంచి వచ్చిన రాజేందర్ రెడ్డి ఇంత మంచి సినిమా తీయడం ఆనందంగా ఉంది. హరితహారం మీద ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి. నాటే మొక్కల కంటే.. కొట్టేసే మొక్కలే ఎక్కువగా ఉన్నాయి. ప్రతీ ఒక్కరూ మొక్కలు పెంచాలి. ఇలాంటి సందేశాన్ని ఇస్తూ తీసిన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’ అని అన్నారు.

రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కేవలం కమర్షియల్‌గా ఆలోచించకుండా.. మంచి సందేశాన్ని ఇచ్చేందుకు సింబా చిత్రాన్ని తీశారు. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి. ఆడియెన్స్ తప్పకుండా ఇలాంటి సినిమాలను ఆదరించాలి. ప్రకృతి చాలా గొప్పది. ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఉపధ్రవాలు సంభవించుకుండా ఉండాలంటే ప్రకృతిని కాపాడుకోవాలి. ఇలాంటి సినిమాను తీసిన టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సంపత్ నందికి ఓ ప్యాషన్ ఉంది. ప్రకృతి మీద ప్రేమతో, ప్రకృతిని ఎలా కాపాడాలనే ఉద్దేశంలో సినిమాను తీశారు. ఆయన గొప్ప సంకల్పానికి నేను అండగా నిలబడాలని అనుకున్నాను. మా సంస్థ నుంచి లక్ష మొక్కల్ని నాటాం. కేవలం నాటడమే కాదు.. వాటిని కాపాడుతూ వచ్చాం. ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి. అందరూ ఇలాంటి సినిమాలను ఆదరించాలి’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ మాట్లాడుతూ.. ‘ఈ కథ చెప్పినప్పుడు నేను ముందుగా సింబా థీమ్ ఇచ్చాను. అలా మా ప్రయాణం ప్రారంభం అయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ చిత్రంలో ప్రతీ పాత్రకు ఓ డిఫరెంట్ థీమ్ క్రియేట్ చేశాం. ఆగస్ట్ 9న అందరూ థియేటర్లో మా సినిమాను చూడండి’ అని అన్నారు.

దివి మాట్లాడుతూ.. ‘సింబాలో నాకు ఛాన్స్ ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. పేపర్ బాయ్ టైంలో మురళీ గారిని కలిస్తే మూడేళ్ల తరువాత ఛాన్స్ వచ్చింది. ఇంత మంచి చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా మస్త్ ఉంటుంది.. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్కరూ మొక్కని నాటి సోషల్ మీడియాలో నాకు ఫోటోలు పంపండి. సినిమా టికెట్లు నేను పంపిస్తాను. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

కస్తూరీ శంకర్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నేను జగపతి బాబుతో కొన్ని సీన్లు చేశాను. మిగతా టీంను ఇక్కడే కలిశాను. ఇలాంటి చిత్రానికి ప్రభుత్వం నుంచి సహకారం అందాలి. ఈ మూవీకి పన్నుని మినహాయించాల’ని కోరారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :