ASBL Koncept Ambience
facebook whatsapp X

మన్నించు తిరుమలేశా..!!

మన్నించు తిరుమలేశా..!!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రదేశం తిరుమల. కోట్లాది మంది హిందువులకు ఇది అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం. ఇక్కడికి వచ్చి శ్రీవారిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. తిరుమలేశుడి లడ్డూను రుచి చూడాలని తపిస్తారు. ఆయన ప్రసాదాలను అత్యంత భక్తిభావంతో స్వీకరిస్తుంటారు. అయితే ఇప్పుడు తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడారని.. అది కూడా జంతు కొవ్వు కలిసిందనే వార్త హిందువుల గుండె పగిలేలా చేస్తోంది. 

తిరుమల ప్రసాదాల్లో జంతు కొవ్వు కలిసిందనే వార్త దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. దీనిపై తీవ్ర వివాదం నెలకొంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ విషయాన్ని బహిర్గతం చేయడం మరింత సంచలనానికి కారణమైంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతకు సంబంధించి ఆయన అనేక అంశాలు వెల్లడిరచారు. కల్తీ నెయ్యికి సంబంధించి ప్రతిష్టాత్మక ఎన్డీడీబీ ల్యాబ్‌ నివేదిక కూడా జంతు కొవ్వు అవశేషాలున్నట్టు గుర్తించడం అనుమానాలకు బలం చేకూర్చింది. కల్తీ నెయ్యి వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. కల్తీ నెయ్యి వాడకపోయినా చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్‌ ఆరోపిస్తున్నారు. అయితే కల్తీ నెయ్యి వ్యవహారంపై నిజానిజాలు బయటకు తీసేందుకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. 

వివాదం ఎక్కడ మొదలైంది..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. ఈ సందర్భంగా సెప్టెంబర్‌ 18న ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. అందులో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్‌ వివాదానికి కారణమయ్యాయి. గత ప్రభుత్వం తిరుమల లడ్డూ తయారీలో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ఆరోపించారు. నెయ్యికి బదులు యానిమల్‌ ఫ్యాట్‌ కూడా వాడారని సంచలన ఆరోపణలు చేశారు. తిరుమల ప్రసాదాల నాణ్యత తగ్గిపోయిందని భక్తులు ఫిర్యాదులు చేశారని.. వాటి నాణ్యత పెంచుతున్నామన్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడే బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. చంద్రబాబు చేసిన ఈ కామెంట్స్‌ ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌ గా మారాయి. సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్‌ పై పెద్ద దుమారమే రేగింది. తిరుమల పవిత్రతను మంటగలిపిన గత ప్రభుత్వంలోని బాధ్యులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌ మొదలైంది.

కేంద్ర మంత్రి జె.పి.నడ్డా ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ధార్మిక సంఘాలు, హిందూ సంఘాలు కల్తీ నెయ్యిని తీవ్రంగా పరిగణించాయి. దీనిపై నిగ్గు తేల్చాలని సర్వత్రా డిమాండ్‌ రావడంతో ప్రభుత్వం దీనిపై సిట్‌ ఏర్పాటు చేసింది. అయితే చంద్రబాబు అనవసర రాద్దాంతం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్‌ మండిపడ్డారు. కల్తీ జరగకపోయినా జరిగినట్లు చెప్తున్నారని.. ముందు ఆయన్ను బీజేపీ పెద్దలు దండిరచాలని సూచించారు. అయితే జగన్‌ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు సీరియస్‌ గా స్పందించారు. డిక్లరేషన్‌ ఇవ్వడం ఇష్టం లేని జగన్‌ ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కల్తీ జరగలేదని టీటీడీ ఈవో చెప్పారని జగన్‌ పదేపదే చెప్తున్నారని.. అది వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చారు. ఏఆర్‌ ఫుడ్స్‌ నుంచి మొత్తం 8 ట్యాంకర్ల నెయ్యి వచ్చిందని.. అందులో నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడేశారని చంద్రబాబు చెప్పారు. అప్పటికే వాటి నాణ్యతపై ఈవోకు అనుమానాలు వచ్చి హెచ్చరించాని.. అయినా వాళ్లు మారలేదన్నారు. అందుకే తర్వాత వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి శాంపిల్స్‌ ను పరీక్షలకు పంపించారన్నారు. ఆ పరీక్షల్లో జంతుకొవ్వు కలిసిందని నిర్ధారణ అయిందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే తామేదో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసినట్లుగా జగన్‌ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుమల పవిత్రతను గత ప్రభుత్వం మంటగలిపిందని.. నాటి ప్రభుత్వం చేసిన అపచారాలకు పాపపరిహారంగా ఆలయ సంప్రోక్షణ చేపట్టింది. శ్రీవారి పోటు సహా అన్నప్రసాదాలు చేసే అన్ని ప్రాంతాల్లో ప్రోక్షణ నిర్వహించింది. ఆలయ అర్చకులు, సిబ్బంది అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ సంప్రదాయాలు, ఆచారాల వ్యవరాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు అనుసరించాలని నిర్ణయించింది. హిందూయేతరులు తిరుమల ఆలయంలోకి ప్రవేశించే ముందు కచ్చితంగా డిక్లరేషన్‌ ఇవ్వాలనే నిబంధనను తప్పనిసరి చేయనుంది.

డిక్లరేషన్‌ ఇస్యూ 

తిరుమల ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్‌ పై వైసీపీ సీరియస్‌ గా స్పందించింది. సూపర్‌ సిక్స్‌ వైఫల్యాలపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని బయటకు తెచ్చారని మాజీ సీఎం జగన్‌ ఆరోపించారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవచ్చనే ఆలోచనతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని.. ఇంతటి దుర్మార్గమైన ఆలోచన ఎవరూ చేయరని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ప్రసాదాల్లో జంతువుల కొవ్వు వాడారని చెప్పడం, కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఆడుకోవడం సరైనదేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టుతో పాటు ప్రధానమంత్రికి లేఖ రాస్తానన్నారు.  వైవీ సుబ్బారెడ్డి 45 సార్లు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న సూపర్‌ స్వామి అని జగన్‌ చెప్పారు. అంతటి భక్తుడిపై ఆరోపణలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. తిరుమలలో నెయ్యి సరఫరాకోసం ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తారని.. నెయ్యి సరఫరా చేసేటప్పుడు తప్పనిసరిగా ఎన్‌ ఎబిఎల్‌ సర్టిఫైడ్‌ ల్యాబ్‌ నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుందని జగన్‌ చెప్పారు. పైగా టీటీడీ అధికారులు మూడు పరీక్షలు చేసిన తర్వాతే దాన్ని లోపలికి అనుమతిస్తారని.. లేకుంటే అసలు లోపలికి కూడా ట్యాంకర్లను పంపరని స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 14-15 సార్లు, తాము అధికారంలో ఉన్నప్పుడు 18 సార్లు నాణ్యతలేని ట్యాంకర్లను తిప్పిపంపినట్లు చెప్పారు. జులై 12న ట్యాంకర్‌ నుంచి శాంపిల్‌ తీసుకున్నప్పుడు అధికారంలో ఉందింది ఎవరని జగన్‌ ప్రశ్నించారు. దాని నివేదిక జులై 23న వస్తే రెండు నెలలపాటు ఎందుకు మిన్నకుండిపోయారని జగన్‌ నిలదీశారు.

తిరుమల నెయ్యి వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందనని.. చంద్రబాబు చేస్తున్న తప్పులకు ప్రాయశ్చిత్తంగా 28న అన్ని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ శ్రేణులను జగన్‌ ఆదేశించారు. అదే రోజు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారు. 27వ తేదీ శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల చేరుకుని శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకోవాలని భావించారు. అయితే జగన్‌ తిరుమల పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అంతేకాక.. ఆలయంలోకి వెళ్లే ముందు జగన్‌ కచ్చితంగా డిక్లరేషన్‌ ఇవ్వాలని కూటమి పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. అయితే తాను ఎంతోకాలంగా తిరుమల వెళ్తాన్నానని.. ఎప్పుడూ లేనిది ఇప్పుడు డిక్లరేషన్‌ ఇవ్వడమేంటని జగన్‌ ప్రశ్నించారు. తాను నాలుగు గదుల మధ్య బైబిల్‌ చదువుతానని.. బయట అన్ని మతాలను గౌరవిస్తానన్నారు. తన మతమేంటో అందరికీ తెలుసన్నారు. అయినా అడుగుతున్నారు కాబట్టి తన మతం మానవత్వం అని.. ఇదే విషాన్ని డిక్లరేషన్‌ లో రాసుకోవాలని జగన్‌ స్పష్టం చేశారు.

కల్తీ నెయ్యి నిజమేనన్న టీటీడీ ఈవో 

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం కలకలం సృష్టిం చడంతో టీటీడీ ఈవో శ్యామలరావు స్పం దించారు. జూన్‌ 16న తాను టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రసాదాల నాణ్యత పడిపోయిందనే ఫిర్యాదులు అందుతున్నాయని.. వెంటనే వాటిపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని శ్యామల రావు వివరించారు. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందితో ఆరా తీయగా నెయ్యి నాణ్యత సరిగా లేదని వివరించారన్నారు. అలా వచ్చిన కొన్ని ట్యాంకర్లలో నెయ్యి నాణ్యత సరిగా లేదని భావించి వాటి శ్యాంపిల్స్‌ తీసుకుని గుజరాత్‌ లోని ఆనంద్‌ లో ఉన్న ఎన్డీడీబీ ల్యాబ్‌ కు పంపినట్లు శ్యామల రావు చెప్పారు. తమిళనాడులోని AR ఫుడ్స్‌కు చెందిన నెయ్యిలో కల్తీ జరిగిందని గుర్తించి 4 ట్యాంకర్లను తిప్పి పంపినట్లు వివరించారు. ఎన్డీడీబీ రిపోర్టులో జంతువుల కొవ్వు, షిష్‌ ఆయిల్‌ లాంటివి కలిసినట్లు నిర్ధారణ అయిందన్నారు. వెంటనే ఏఆర్‌ ఫుడ్స్‌ ను బ్లాక్‌ లిస్టులో పెట్టి విచారణకు ఆదేశించామన్నారు. మరోవైపు నిబంధననలు ఉల్లంఘించి కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్‌ ఫుడ్స్‌ పై టీటీడీ అధికారులు కేసు పెట్టారు. వాస్తవానికి తిరుమలకు నెయ్యి సప్లై చేస్తున్న వాళ్లలో ఏఆర్‌ ఫుడ్స్‌ మాత్రమే అతి తక్కువ ధరకు పంపిస్తోంది. లీటర్‌ ఆవు నెయ్యిని రూ.319లకే పంపిస్తామని టెండర్‌ ఖరారు చేసుకుంది. అయితే అంత తక్కువ ధరకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎవరూ సరఫరా చేయలేరని.. కల్తీ నూనె మాత్రమే సరఫరా చేయగలరని మిగిలిన కంపెనీలు చెప్తున్నాయి. ఇంత తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తామని ఏఆర్‌ ఫుడ్స్‌ కంపెనీ ముందుకొచ్చినప్పుడు నాటి వైసీపీ ప్రభుత్వం ఎందుకు అనుమానించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాటి పాలకులు ఆ కంపెనీతో కుమ్మక్కయి కల్తీ నెయ్యి సరఫరా అయ్యేలా చేశారనేది కూటమి నేతల విమర్శ.

నిజాలు నిగ్గుతేల్చేందుకు సిట్‌ 

చంద్రబాబు చేసిన కామెంట్స్‌ సంచలనం కలిగించడంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై విచారణ జరపాలనే డిమాండ్‌ మొదలైంది. హిందువులు, హిందూ సంఘాలు ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌ గా తీసుకోవాలని కోరాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కల్తీ నెయ్యిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం - సిట్‌ ఏర్పాటు చేసింది. సిట్‌ చీఫ్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికార సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. భక్తులు, పోటు సిబ్బందితో పాటు వివిధ శాఖల టీటీడీ ఉద్యోగులు, అధికారుల నుంచి సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

టీటీడీ దిద్దుబాటు చర్యలు..! 

కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపతుండండతో టీటీడీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భావించింది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సూచన మేరకు చర్యలు తీసుకోనుంది. తిరుమలకు సరఫరా అయ్యే బియ్యం, పప్పు దినుసులు, మసాలాలు, నూనెలు, నెయ్యి, కూరగాయలు.. లాంటి అనేక ఆహార పదార్థాలన్నింటినీ తనిఖీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికవరకూ ప్రాథమిక పరీక్షలకే పరిమితం అయిన ల్యాబ్‌ ను అప్‌ గ్రేడ్‌ చేస్తోంది. నేషనల్‌ డెయిరీ డెవలప్మెంట్‌ బోర్డ్‌ (NDDB) ఆధ్వర్వయంలో రూ.75 లక్షల రూపాయల వ్యయంతో అత్యాధునిక ప్రయోగశాలను తీర్చిదిద్దు తోంది. ఇది డిసెంబర్‌ నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఇది పూర్తయితే అన్ని రకాల పరీక్షలను తిరుమలలోనే చేసేందుకు వీలవుతుంది. బయటి ప్రయోగశాలలపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు.  తిరుమలను కోట్లాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. తిరుమల ప్రసాదాలను అత్యంత భక్తిభావంతో స్వీకరిస్తారు. ఇప్పుడు వాటి పవిత్రతపై మచ్చ పడిరది. దీన్ని వీలైనంత త్వరగా చెరిపేయాల్సిన బాధ్యత టీటీడీ, ప్రభుత్వంపై పడింది.

 

- సి. ఎల్‌. నరసింహ రాజు
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :