Sri Reddy : లెంపలేసుకుంటున్న శ్రీ రెడ్డి..! లోకేశ్ వదిలేస్తారా..?
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిన వాళ్లపై కేసులు నమోదవుతున్నాయి. వెంటనే వాళ్లను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. కొంతమందికి నోటీసులు ఇచ్చి పంపిచేస్తున్నారు. మరికొందరిని రిమాండ్ కు తరలిస్తున్నారు. దీంతో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇప్పుడు వణికిపోతున్నారు. అలాంటి వాళ్లంతా తప్పయిపోయిందని లెంపలేసుకుంటున్నారు. వాళ్లలో నటి శ్రీ రెడ్డి ముందుంటున్నారు.
నటి శ్రీ రెడ్డి గురించి తెలియని వాళ్లుండరు. టాలీవుడ్ లో మీటూ ఉద్యమం సందర్భంగా శ్రీరెడ్డి అందరికి చిరపచితులయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ వదిలేసి చెన్నై వెళ్లి స్థిరపడ్డారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీకి అనుకూలంగా, టీడీపీ – జనసేనకు వ్యతిరేకంగా ఆమె పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. వాస్తవానికి ఆమె వైసీపీ సభ్యురాలు కాదు. కానీ ఆ పార్టీపట్ల ప్రేమతో శ్రీ రెడ్డి మాత్రం ఇతర పార్టీల నేతలపై నోరు పారేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పై ఆమె చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ఆమె కామెంట్స్ పై గతంలోనే ఫిర్యాదులు చేసినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది.. టీడీపీ అధికారంలోకి వచ్చింది. గత నెల వరకూ శ్రీ రెడ్డి వైసీపీకి అనుకూలంగానే పోస్టులు పెడుతూ వచ్చింది. మళ్లీ అధికారంలోకి వస్తామని.. సత్తా ఏంటో చూపిస్తామని సవాళ్లు విసురుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు మొదలయ్యాయో అప్పుడు శ్రీ రెడ్డి ప్లేట్ ఫిరాయించేసింది. తప్పయిపోయింది లోకేశ్ అన్నా.. పవన్ అన్నా.. అనిత గారూ.. అంటూ పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. అప్పట్లో తాను చేసింది తప్పేనని.. ఇప్పుడు నన్ను వదిలేయాలని ప్రాధేయపడుతున్నారు. అయినా టీడీపీ, జనసేన కార్యకర్తలు మాత్రం వదలట్లేదు. శ్రీ రెడ్డిపై కేసులు పెడ్తూనే ఉన్నారు.
తాజాగా శ్రీ రెడ్డి లోకేశ్ కు బహిరంగ లేఖ రాశారు. తన ఫ్యామిలీ అంతా టీడీపీకే ఓటేసిందన్నారు. తన స్నేహితులంతా కమ్మ కులస్తులేనన్నారు. అమరావతి రాజధాని అయినందుకు విజయవాడలో తమ ఇంటి విలువ పెరిగిందన్నారు. లోకేశ్ అన్నా.. మీలో మంచితనం ఉందని తెలుసు.. కాబట్టి నన్ను క్షమించి వదిలేయాలని అన్నారు. ఇంకెప్పడూ మీ జోలికి రానని మాటిస్తున్నా అన్నారు. తన వల్ల తన కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకూడదన్నారు. మరోవైపు జగన్ కు కూడా శ్రీ రెడ్డి లేఖ రాశారు. తన వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తున్నందుకు క్షమించాలని కోరారు. ఇలా శ్రీ రెడ్డి ఇప్పుడు నాలుక కరుచుకుంటున్నారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. శ్రీ రెడ్డి లేఖలు రాస్తున్న కొద్దీ పాత వీడియోలను టీడీపీ, జనసేన నేతలు తవ్వి తీస్తున్నారు. అప్పుడు బరితెగించి ఇప్పుడు బుద్ధొచ్చిందని చెప్తే వదిలేయాలా అని ప్రశ్నిస్తున్నారు. కేసులు పెడుతూనే ఉన్నారు. నేడో రేపో శ్రీ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. అయితే తనను అరెస్టు చేస్తారనే భయంతో శ్రీ రెడ్డి చెన్నై వదిలి బెంగళూరు పారిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.