పర్యాటక వీసాలు త్వరగా వచ్చేందుకు చర్యలు : జెన్నీ సొలోలొస్కి
అమెరికాలో పర్యటించాలనుకునే వారికి వీసాలు త్వరగా వచ్చేలా కృషి చేస్తామని డిప్యూటీ కాన్సులర్ ఇన్ఫరేషన్ చీఫ్ జెన్నీ సొకోలొస్కి తెలిపారు. మంగళగిరిలోని ఎఫట్రానిక్స్ సంస్థలో ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సమావేశానికి జెన్నీ సొకోలోస్కి, యూఎస్ కాన్సుల్ జనరల్ చీఫ్ రెబెక్కా డ్రేమ్ హాజరయ్యారు. అమెరికా విడుదల చేసే బీ1, బీ2 వీసాలలో తీవ్రజ్యాపం జరుగుతోందని క్యాక్రమానికి హాజరైన వ్యాపారవేత్తలు కాన్సులేట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జెన్నీ సొకోలొస్కి మాట్లాడుతూ బీ1, బీ2 వీసాలలో జాప్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని కాన్సులేట్ కార్యాలయంలో గత ఏడాది నుంచి సిబ్బందిని పెంచామని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. అత్యవసర సమయాల్లో శస్త్ర చికిత్స చేయించుకునేందుకు వీలైనంత తక్కువ రోజుల్లోనే వీసాలు మంజూరు చేస్తున్నామని సొకోలొస్కి తెలిపారు.
అమరావతిలో కాన్సులేట్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఓ వ్యాపారవేత్త అడగ్గా ప్రస్తుతం విశాఖలో ఓ కార్యాలయం ఉందని, క్రమేణా దాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చుక్కపల్లి అవినాష్, ఎఫట్రానిక్స్ ఉపాధ్యక్షుడు దాసరి అన్వేష్, ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షురాలు శ్రీదేవి దేవిరెడ్డి పాల్గొన్నారు.