ASBL Koncept Ambience
facebook whatsapp X

చైనాలో పెళ్లికాని ప్రసాద్ లు.. వధువుల్లేక బ్రహ్మచారి బతుకు..!

చైనాలో పెళ్లికాని ప్రసాద్ లు.. వధువుల్లేక బ్రహ్మచారి బతుకు..!

ప్రస్తుతం చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో పెరిగిపోతున్న జనాభాకు సంబంధించి చైనా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. దేశంలో పెరుగుతున్న వృద్ధాప్య జనాభా, తగ్గుతున్న జననాల రేటును బ్యాలన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు మరో సమస్య ఎదురైంది. పెళ్లిళ్లకు ఆడపిల్లల కొరత ఆందోళన కలిగిస్తోంది. పురుషుల కన్నా దేశంలో మహిళలే చాలా తక్కువ ఉన్నారు. చైనాలో దాదాపు 35 మిలియన్ల మంది ఒంటరి పురుషులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా 30 ఏళ్ల వయస్సు నుంచి 40 ఏళ్ల వయస్సులో ఉన్నారు. వీరంతా పెళ్లి చేసుకునేందుకు వధువుల లేక బ్రహ్మచారులుగా మిగిలిపోయారు.

ఇప్పుడు విదేశీ వధువులను ఎంచుకోవడం ఒక్కటే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా ఒకే బిడ్డ విధానం, సామాజిక ప్రాధాన్యత కారణంగా జీవిత భాగస్వామిని కనుగొనేందుకు కష్టపడుతున్నారు. అయితే, ఒక చైనీస్ ప్రొఫెసర్ ఈ సమస్యకు అంతర్జాతీయ వివాహాలే సరైన పరిష్కారాన్ని సూచిస్తున్నారు. చైనాలో ఈ లింగ అసమానత శకం దశాబ్దాల నాటి ‘ఒక బిడ్డ విధానం’ తర్వాత ప్రారంభమైంది. ఈ నిబంధన వల్ల దేశంలో లింగ నిష్పత్తి క్షీణించింది. 2020లో నిర్వహించిన జాతీయ జనాభా గణన ప్రకారం.. ప్రస్తుతం దేశంలో పురుషుల సంఖ్య మహిళల కన్నా దాదాపు 3.4 కోట్లు ఎక్కువ. ఇన్‌స్టిట్యూట్ ఫర్ చైనా రూరల్ స్టడీస్ ఇటీవలి నివేదికలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువకులు జీవిత భాగస్వామిని కనుగొనడంలో ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రస్తావించింది.

అంతర్జాతీయ వివాహాలే పరిష్కారమా?

దేశంలో దాదాపు 35 మిలియన్లు అంటే.. 3.5 కోట్ల మంది పురుషులు ఒంటరిగా ఉన్నారు. వీరికి వధువుల కొరత ఉంది. ఈ మేరకు ఒక నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జియామెన్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డింగ్ చాంగ్ఫా అంతర్జాతీయ వివాహాలను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. చైనీస్ పురుషులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు, జీవిత భాగస్వాముల కోసం రష్యా, కంబోడియా, వియత్నాం, పాకిస్తాన్ వంటి దేశాల్లో చూడవచ్చునని డింగ్ సూచిస్తున్నారు. ఎక్కువ మంది విదేశీ వధువులను చైనాకు తీసుకురావాలని డింగ్ సిఫార్సు చేసినట్లు ఎస్‌సీఎంపీ నివేదించింది.

విదేశీయులతో వివాహాలపై ఆందోళన :

అంతర్జాతీయ వివాహాలను సాధ్యమైన పరిష్కారంగా ప్రోత్సహించడాన్ని ప్రతిపాదించింది. అయితే దీనిపై వివాదం నెలకొంది. డింగ్ వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో వ్యతిరేకతను రేకెత్తించాయి. విదేశీ వధువులను “దిగుమతి చేసుకోవడం” అనే భావన మానవ అక్రమ రవాణాకు దారితీస్తుందని చాలా మంది మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు భాషా అవరోధాల పట్ల కూడా వ్యతిరేకతను చూపారు. కుటుంబ కలహాలు, సాంస్కృతిక అపార్థాలకు దారితీస్తుందని భయాందోళన చెందుతున్నారు.

మ్యాచ్ మేకింగ్ ట్రెండ్

లింగ అసమానత పెరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్ మేకింగ్ ట్రెండ్ నడుస్తోంది. కొంతమంది ప్రొఫెషనల్ మ్యాచ్‌మేకర్లు ప్రత్యేకంగా చైనీస్ పురుషులను రష్యన్ మహిళలతో కనెక్ట్ చేయడమే లక్ష్యంగా మ్యాచ్ మేకింగ్ సర్వీసులను అందించడం ప్రారంభించారు. ఈ కొత్త విధానం రెండు దేశాల మధ్య లింగ అసమానత అంతరాన్ని తగ్గించనుంది. రష్యాలో పురుషుల కన్నా మహిళల జనాభా ఎక్కువగా ఉండటం గమనార్హం.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :