Sukhbir singh badal: సుఖ్ బీర్ సింగ్ బాదల్ పై కాల్పులు.. గోల్డెన్ టెంపుల్ లో కాల్పుల కలకలం...
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో కాల్పులు కలకలం రేపాయి. ప్రఖ్యాత స్వర్ణ దేవాలయంలో పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (Sukhbir Singh Badal)పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఆయన సేవాదార్‌గా శిక్ష అనుభవిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయ (Golden Temple) ప్రవేశద్వారం వద్ద సుఖ్‌బీర్ చక్రాల కుర్చీపై కూర్చొని సేవాదార్ (కాపలాదారుడు)గా ఉండగా.. ఓ వృద్ధుడు ఆయనను సమీపించాడు. కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న అతడు ప్యాంట్ జేబులోంచి తుపాకీ తీసి సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపాడు. గమనించిన సుఖ్‌బీర్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే వృద్ధుడిని అడ్డుకొని పక్కకు తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది.
భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో సుఖ్‌బీర్‌కు ఎలాంటి హానీ జరగలేదు. నిందితుడిని నరైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతడు గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రముఠాలో పనిచేసినట్లు పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. 1984లో నరైన్ సింగ్ సరిహద్దులు దాటి పాకిస్థాన్ వెళ్లినట్లు తెలుస్తోంది.పంజాబ్‌లోకి అక్రమ ఆయుధాలు తేవడం, పేలుడు పదార్థాల రవాణాలో ఇతడు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఆ తర్వాత కొంతకాలానికి భారత్ తిరిగొచ్చిన అతడిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్ల పాటు జైలుశిక్ష కూడా అనుభవించినట్లు తెలుస్తోంది.
శిరోమణి అకాలీదళ్ పార్టీ (Shiromani Akali Dal) అధికారంలో ఉన్న సమయంలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (Sukhbir Singh Badal) మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 2007-17 మధ్య కాలంలో పార్టీతోపాటు వారి ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు అకాల్ తఖ్త్ నిర్ధరించింది. ఈ విషయంలో పార్టీ చీఫ్ సుఖ్‌బీర్‌ను దోషిగా తేల్చింది. సేవకుడిగా అమృత్‌సర్ (Amritsar)లోని స్వర్ణదేవాలయంలో పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని ఆదేశించింది.
అంతేకాకుండా శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్‌గా ఉన్న ఆయన రాజీనామాను ఆమోదించి.. ఆరు నెలల్లోగా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని సూచించింది. దీంతో ఆయన మంగళవారం నుంచి ఈ శిక్షను అనుభవిస్తున్నారు. చేసిన తప్పులను అంగీకరిస్తున్నట్లు రాసి ఉన్న ఓ చిన్న బోర్డును మెడలో వేసుకొని, చేతిలో ఈటెను ధరించి సేవాదార్‌గా పనిచేస్తున్నారు.