కాలిఫోర్నియాలో సువిధ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు
కాలిఫోర్నియా నగరంలో సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. శాక్రమెంటో కేంద్రంగా పనిచేసే ప్రముఖ తెలుగు ఆర్గనైజేషన్ సువిధ ఇంటర్నేషనల్ కాలిఫోర్నియాలో రెండు ప్రాంతాల్లో దీపావళి సంబరాలు నిర్వహించింది. రాంచో కార్డోవా, ఫాల్సామ్‌లలో జరిగిన ఈ సంబరాల్లో వేలాది మంది ఎన్నారైలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రాంచో కార్డోవా ప్రభుత్వంతో చేతులు కలిపిన సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్.. అక్టోబరు 26న దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించింది. శాక్రమెంటో సమీపంలోని గ్రీన్ పార్క్ విలేజ్‌లో జరిగిన ఈ వేడుకల్లో రెండువేల మందికిపైగా స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారందరికీ సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా స్వీట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాంచో కార్డోవా వైస్ మేయర్ శ్రీమతి సిరి పులిపాటి.. దీపావళి ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
స్థానిక మ్యూజిక్ గ్రూప్ గోంగూర సింగర్స్‌తోపాటు ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు అబ్దుల్ షేక్, శ్రీనాథ్, అనిత, మధురిమ తదితరులంతా తమ గానమాధుర్యంతో ప్రేక్షకులను అలరించారు. అభినవ్ ఆశా కొండ, ప్రియాంక బలిన, హరిప్రియ, పింకీ పింగళి వంటి స్థానిక సింగర్స్ కూడా తమ సత్తా చాటారు.అలాగే మరికొంతమంది స్థానిక యువత తమ పెర్ఫామెన్స్‌లతో అందరినీ అలరించారు.
అదే విధంగా, నవంబరు 2న ప్రి రోడియో స్టేడియంలో సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడే ట్రెడిషనల్‌గా అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నాడు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటారు. అలాంటి వేదికపై దీపావళి సంబరాలు జరగడం చాలా అరుదైన విషయం. ఈ వేడుకల్లో కూడా గోంగూర మ్యూజిక్ గ్రూప్ తమ ట్యాలెంట్ చూపించింది. అలాగే ఎన్నో సంప్రదాయ ప్రదర్శనలు కూడా అందర్నీ అలరించాయి. రుచి రెస్టారెంట్, ఫాల్సామ్ కర్రీ పిజ్జా అందించిన నోరూరించే వంటకాలు కూడా అందరికీ నచ్చాయి.
ఫాల్సామ్ సిటీ కౌన్సిల్ మెంబర్ వైకే చాలంచెర్ల ఈ వేడుకలకు అందర్నీ ఆహ్వానించారు. దీపావళి ప్రజలను ఏకం చేస్తుందని, ఆనందాన్ని పంచుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌ను అభినందించారు.
ఈ రెండు కార్యక్రమాలను నిర్వహించిన సువిధ ఇంటర్నేషనల్ ఫౌండర్, ప్రెసిడెంట్ భాస్కర్ వేంపటి, వేణు ఆచార్య, వందన శర్మ బాల కొడవటిగంటి, శైలేష్ భట్, తృప్తి తివారి, పద్మప్రియ బ్యాడీ, అవినాష్ మ్యాడీ, రూమా బరువా, శ్వేత మిర్యాల, సౌమ్య బోయినపల్లి తదితరులు.. అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ దీపావళి సంబరాలు విజయవంతం అవడానికి కృషి చేసిన సిబ్బంది, అతిథులు, స్పాన్సర్లు, పెర్ఫామర్లు, వాలంటీర్లు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.