ASBL Koncept Ambience
facebook whatsapp X

ఘనంగా ‘తామా’ దీపావళి వేడుకలు

ఘనంగా ‘తామా’ దీపావళి వేడుకలు

అట్లాంటా లో 43 ఏళ్లుగా తెలుగు ప్రజలకు సేవలందిస్తూ అభిమానాన్ని చూరగొన్న మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (‘తామా’) నవంబర్‌ 16, 2024 శనివారం రోజున దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించింది.   ఆల్ఫారెట్టా నగరంలో మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సంగీత విభావరి, మగవారికి ఫ్యాషన్‌ షో తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలలో పండుగలను ఎలా జరుపుకుంటారో అలాగే అట్లాంటా లో దీపావళి వేడుకలు జరిగాయి. తామా సాంస్కృతిక కార్యదర్శి సునీల్‌ దేవరపల్లి  ఆహూతులందరని ఆహ్వానించారు. తరువాత తామా  టీం మరియు బోర్డు సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించి వారిచే జ్యోతి ప్రజ్వలన గావించారు. అధ్యక్షులు సురేష్‌ బండారు తామా ఇప్పటి వరకు ఏయే కార్యక్రమాలు చేశారో వివరించారు.బోర్డు ఛైర్మన్‌ శ్రీనివాస్‌ ఉప్పు  తామా ఉచిత క్లినిక్‌ , మనబడి, వివిధ సదస్సుల వివరాలు తెలిపారు. ముందుగా వినాయకుని పాటతో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. క్లాసికల్‌ వెస్ట్రన్‌ ఫ్యూషన్‌, కీర్తనలు, సినిమా పాటలు, కూచిపూడి నృత్యాలు, బ్రేక్‌ డ్యాన్సులు వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలను సునీల్‌ దేవరపల్లి సమన్వయపరిచి, పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలను బహుకరించారు. కార్యక్రమానికి ముఖ్య వ్యాఖ్యాతగా దీప్తి వ్యవహరించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన జార్జియా రాష్ట్రం 48 డిస్ట్రిక్ట్‌ సెనెటర్‌ షాన్‌ స్టిల్‌ ను  అతని భార్య డయానాను శ్రీరామ్‌ రొయ్యల వేదిక పైకి ఆహ్వానించారు. 

తామా 43వ వార్షిక ప్రత్యేక సంచికని సెనెటర్‌ షాన్‌ స్టిల్‌ విడుదలచేసి వేదిక మీద తామా కార్యవర్గ సభ్యులకు అందజేసారు. అనంతరం సెనెటర్‌ షాన్‌ స్టిల్‌  శ్రోతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తనను మరొక రెండు సంవత్సరాలు సెనెటర్‌ గా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియచేసి, తెలుగు భాషను ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ భాషగా గుర్తించేటట్లు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా సాయిరామ్‌ కారుమంచి మరియు ప్రియాంక గడ్డం మధ్యాహ్నం 2 గంటలకు పిల్లలకు ప్రత్యేకంగా కవితలు, చిన్న కథల పోటీలు, బాలల పోటీలు నిర్వహించారు. పిల్లలను వయసును బట్టి 3 వర్గాలుగా విభజించి పోటీలు నిర్వహించడం జరిగింది. తెలుగు భాష ను ప్రోత్సహిస్తూ చిన్నారులకు భాషా పోటీలు నిర్వహించి విజేతలకు ఈ వేదికపై బహుమతులు ప్రదానం చేయడం విశేషం.

సాయిరామ్‌ కారుమంచి, ప్రియాంక గడ్డం మరియు సుమ పోతిని థింక్‌ టేల్స్‌ అకాడమీ వారి సంయుక్త ఆధ్వర్యంలో మ్యాథ్స్‌ బౌల్‌ పోటీలు నిర్వహించారు. 200 మందికి పైగా బాలబాలికలు పాల్గొని, తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ముందుగా తామా విద్యా కార్యదర్శి సుధా ప్రియాంక అందరినీ పోటీలకు ఆహ్వానించి, నియమ నిబంధనలు వివరించారు. విజేతలకు వేదిక మీద బహుమతి ప్రదానం జరిగింది. శశి దగ్గుల, శ్రీనివాసులు రామిశెట్టి పర్యవేక్షణలో వివిధ రకాల వ్యాపారులు ఏర్పాటు చేసిన ముప్ఫైపైగా స్టాల్స్‌ లో ప్రత్యేక ఆహార పదార్ధాలు, ఆభరణాలు, వస్త్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ స్స్టాల్ల్స్‌ చుట్టూ పిల్లలు, మహిళలు సరదాగా తిరుగుతూ, కొనుగోలు చేయడం కనిపించింది. కార్యక్రమాల మధ్యలో రాఫుల్‌  తీయడం జరిగింది, పాల్గొన్న ప్రేక్షకులు ఎన్నో విలువైన బహుమతులు గెలుచుకున్నారు.

డి.జె టిల్లు, అశ్వత్థామ, మేజర్‌ వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం చేసిన చరణ్‌ పాకాల మరియు వారి బృందం చెవులకింపుగా ఆలపించిన గీతాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. అలాగే వారి టీం (యామిని ఘంటసాల`దేవిక) మ్యూజికల్‌ నైట్‌ ప్రదర్శనతో కార్యక్రమానికి వచ్చిన వారంతా పరవశించిపోయారు. ఎంతో మంది ఆహూతులు ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. ఇంతగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన కళాకారులను తామా వారు సన్మానించి సత్కరించారు. దాదాపు 1000 మందికి పైగా అట్లాంటా వాసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చరణ్‌ పాకాల మరియు బృందం నిర్వహించిన సంగీత విభావరి ఆహూతులందరిని ఉర్రూతలూగించింది. ఏ కార్యక్రమానికైనా స్పాన్సర్లు ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. ప్రత్యేక అతిథుల సమక్షంలో అధ్యక్షులు సురేష్‌ బండారు  వేదిక మీదకు స్పాన్సర్లను సాదరంగా ఆహ్వానించారు. స్పాన్సర్లందరికీ మొమెంటో, శాలువా మరియూ పుష్పగుచ్ఛముతో ఘనంగా సత్కరించడం జరిగింది.

స్వర్గీయ శ్రీనివాస్‌ రాయపురెడ్డి గారి మెమోరియల్‌ తామా వాలంటీర్‌ 2024 అవార్డు ఎప్పుడూ వెనక వుండి ఎంతో పని చేసే లక్ష్మి మండవల్లి కి ఇవ్వడం జరిగింది. డాక్టర్‌ శ్రీహరి మాలెంపాటిగారు తామా ఉచిత క్లినిక్‌ ఏర్పాటు చేయడంలో ఎంతో తోడ్పాటు అందించారు. ఆయన స్మారకార్థం తామా క్లినిక్‌ వాలంటీర్‌ అవార్డు ఈ సంవత్సరం మొదటి నుండి ఎంతో సేవ చేసిన సంధ్య వాసిరెడ్డి కి ఇచ్చారు. అదే సమయంలో తామా క్లినిక్‌ వాలంటీర్‌ డాక్టర్లను సత్కరించారు. ఇదే వేదికపైన రూపేంద్ర వేములపల్లి 2025 సంవత్సరానికి ఎన్నికైన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబెర్స్‌ ని పరిచయం చేశారు. 

తామా వారి భోజనాలు చాలా రుచిగా, శుచిగా ఉంటాయన్నది అందరూ అనుకునే మాట. ఈసారి ప్రముఖ రెస్టారెంట్‌ పక్కా లోకల్‌ రెస్టారెంటు వంటకాలు రుచికరంగా అందజేశారు.  

ఈ కార్యక్రమంలో తామా కార్యవర్గ మరియు బోర్డ్‌ సభ్యులు శ్రీనివాస్‌ ఉప్పు, సురేష్‌ బండారు, చలమయ్య బచ్చు, ప్రియాంక గడ్డం, రాఘవ తడవర్తి, సునీత పొట్నూరు, ప్రవీణ్‌ బొప్పన, రవి కల్లి, ఇన్నయ్య ఎనుముల, సుమ పోతిని, వెంకట శివ గోక్వాడ, కృష్ణ ఇనపకుతిక, పవన్‌ దేవులపల్లి, నగేష్‌ దొడ్డాక, సాయిరామ్‌ కారుమంచి, శశి దగ్గుల, శ్రీనివాసులు రామిశెట్టి, రూపేంద్ర వేములపల్లి, సునీల్‌ దేవరపల్లి, సత్య నాగేందర్‌ గుత్తుల, మధు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.చివరిగా కన్నుల పండుగగా, వీనుల విందుగా సాగిన దీపావళి వేడుకలను విజయవంతం చేసిన తామా బృందం స్పాన్సర్లు కి, వాలంటీర్లు కి, ముఖ్య అతిధులకి, ప్రాంగణం యాజమాన్యానికి, ఆర్టిస్టులకు, అట్లాంటా పక్కా లోకల్‌ రెస్టారెంటు తదితరులకు, కార్యవర్గ మరియూ బోర్డు సభ్యులకు, ప్రేక్షకులందరికీ ఉపాధ్యక్షుడు రూపేంద్ర వేములపల్లి  హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి ద్విగ్విజయంగా ముగించారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :