ASBL Koncept Ambience
facebook whatsapp X

టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' తెలుగు సాహిత్య వేదిక 206 వ సాహిత్య సదస్సు

టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' తెలుగు సాహిత్య వేదిక 206 వ సాహిత్య సదస్సు

అక్టోబరు నెల 20  వ తేదీ ఆదివారం జరిగిన డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ ''నెలనెల తెలుగువెన్నెల'' ,తెలుగు సాహిత్య వేదిక  207 వ సాహిత్య సదస్సు 'జన పథం_జానపద కవిత్వం' అంశంపై  లూయిస్ విల్ ,టెక్సాస్  నగరము నందు గల సమావేశ మందిరము వేదికగా నిర్వహించబడింది. సదస్సు  ప్రారంభ సూచికగా శ్రీ లెనిన్ వేముల గారు నారాయణ తీర్థుల విరచిత 'జయ జయ దుర్గే' కీర్తనను తన మధుర కంఠంతో వీనుల విందుగా పాడి తదుపరి  స్వాగతోపన్యాసం చేశారు.

తొలుత సాహితీ ప్రియులనందరినీ భాగస్వాములను చేస్తూ గత 78 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న  ధారావాహిక 'మనతెలుగుసిరిసంపదలు' శీర్షికగా చమత్కార గర్భిత పొడుపు పద్యాలు ప్రహేళికలు ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులనుండి సరైన సమాధానాలను రాబట్టడంలో విజయవంతమైన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి వారిని పలువురు ప్రశంసించడం జరిగింది .  

తదుపరి ఆస్టిన్ నగర వాసులైన కవి శ్రీ రామ్ డొక్కా గారు తాను అద్భుతంగా వ్రాసిన స్వీయకవితలను సభతో పంచుకున్నారు. వారు పంచుకున్న మననం 2019, ఊపిరి కవితలు సాహితీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తరువాత శ్రీ చంద్రహాస్ గారు ఈమాట వ్యాస సంపుటి గా వెలువడి నూతనంగా  ప్రచురింపబడిన 'మనకు తెలియని మన త్యాగరాజు' పుస్తక పరిచయం చేయడం  జరిగింది.ఈ గ్రంథ రచయిత శ్రీ బ్రహ్మానందం బహుముఖ ప్రజ్ఞాశాలి అనీ వారి రచనలు  వాస్తవికతకు దగ్గరగా ఉండడం పేర్కొంటూ ఈ పుస్తకం అందరూ చదువదగిన పుస్తకంగా అభివర్ణించారు. 

ప్రముఖ కవయిత్రి శ్రీమతి కాశీనాధుని రాధ గారు ''మాసానికో పద్య సుగంధం''లో ఆదికవి నన్నయ విరచిత మహాభారతం ఆదిపర్వం సప్తమాశ్వాసములోని పద్యాలను పాడి సందర్భ సహిత వ్యాఖ్యను జోడించి సాహితీప్రియుల మన్ననలందుకొన్నారు. శ్రీ సురేష్ కాజా గారు 'కథ అంటే ఏమిటి 'అనే శీర్షికపై వివరణాత్మకంగా  మాట్లాడడం జరిగింది.గ్రామదేవతల పుట్టుక గురించి  జానపద కవి అందెశ్రీ వ్రాసిన 'కొమ్మ చెక్కితే బొమ్మరా..కొలిచి మొక్కితే అమ్మరా' కవితను శ్రీ లెనిన్ వేముల గారు రాగయుక్తంగా పాడి సాహితీ  ప్రియులను అలరించారు.

తరువాత  ముఖ్య అతిథి డాక్టర్ లక్కరాజు నిర్మల గారు 'జన పథం ..జానపద కవిత్వం' ప్రసంగాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం తాము నివసిస్తున్న సమాజంలో  తెలుగు జాతి జనుల పథ గమనాన్ని వర్ణిస్తూ సాగినప్రసంగం అందరినీ ఆకట్టుకొంది. మిల్లేట్ల వాడుక  పై కవిత, హైదరాబాదు లైఫ్ స్టైల్'' పై కవిత, సాక్షి పత్రిక కోసం వ్రాసిన బతుకమ్మ పాటలు, మహబూబ్ నగర్ ప్రాంతంలో ప్రసిద్ధమైన నీటి ఆవకాయ,,ఇంకా ఆధునిక చలన చిత్ర  గీత రచనలుమొదలుకొని ''పంచభూతాలు'' వంటి లౌకిక, ఆధ్యాత్మిక రచనా ధోరణులపై జానపదుల పదాల ప్రభావాన్ని వివరిస్తూ  అనేకానేక అంశాలను ప్రస్తావించారు డాక్టర్ నిర్మల.అంతే కాకుండా   కాలమాన ప్రాంత, సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబింప చేస్తూ మాండలిక వ్యత్యాసాలను  సంభాషణ ల రూపంలో అభినయించారు కూడా .. వీరు తన ప్రసంగంలో జానపద వికాసానికి కృషి చేసిన కవులతో బాటు ప్రసిద్ధ జానపద సాహిత్య పరిశోధకులను కూడా గుర్తు చేశారు. నైతిక విలువలను బోధిస్తూ  తాను వ్రాసిన  గ్రామీణ  జానపద సాహిత్య కవితల్ని తెలంగాణా యాసలో ఆమె పాడిన తీరు సాహితీ ప్రియులను కట్టిపడేసిందనడంలో సందేహం లేదు.

తరువాత ఉత్తర టెక్సాస్  తెలుగు సంఘం(టాంటెక్స్)  ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్  బండారు మరియు పాలక మండలి సభ్యులు, కర్యక్రమ  సమన్వయకర్త శ్రీ దయాకర్ మాడా నేటి ముఖ్య అతిథి డాక్టర్ నిర్మల గారికి సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను సమర్పించి దుశ్శాలువతో సన్మానించడం జరిగింది. సన్మాన  సందర్భముగా   పలువురు వక్తలు ప్రసంగిస్తూ చుట్టూ ఉన్న సమాజాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తూనే అంతరంగం పొరల్లోకి తొంగి చూసే తాత్విక దృక్పథం డాక్టర్.లక్కరాజు నిర్మలకు అలవడినట్లు ఆమెను వేనోళ్ళ కొనియాడడం జరిగింది.ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈసన్మానం  అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని పేర్కొంటూ డాక్టర్ నిర్మల తన కృతజ్ఞతను వెలిబుచ్చారు. 

సందర్భంగా అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు ,తమ అధ్యక్షోపన్యాసంలో, సంస్థ పూర్వాధ్యక్షులకూ, సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ, ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు.                                 .  

ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, శ్రీ రాజారెడ్డి, శ్రీ వీర్నాపు చిన్న సత్యం గార్ల లతో పాటు  శ్రీ వంశీ చిట్లూరు, శ్రీ కిశోర్ నారే, శ్రీనాగార్జున నలజుల, శ్రీ లెనిన్ బందా,  శ్రీ నవీన్  గొడవర్తి, శ్రీ శ్రీధర్ నంబూరు, శ్రీఏ వీ రామ్ జోగారావు, శ్రీమూలింటి రాజశేఖర్, శ్రీ శివ దొంగల, శ్రీ వెంకట్ జట్టుకొండ, శ్రీమతి మహా లక్ష్మి పసుమర్తి ఇంకా అంతర్జాలంలో శ్రీ గోవర్ధన రావు నిడిగంటి, శ్రీ కె ఏ మూర్తి, శ్రీ నగేష్ తో పాటు డాలస్, హ్యూస్టన్, ఆస్టిన్ నగరాలనుండి అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొనడంతో సదస్సు విజయవంతమైంది. 

చివరగా శ్రీ దయాకర్ మాడా  వందన సమర్పణ గావించారు.తమ సమావేశ మందిరాన్ని కార్యక్రమ వేదికకు పెద్ద మనసుతో ఇచ్చిన శ్రీ తిరుమల్ రెడ్డి కుంభం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేశారు. నేటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన  ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు  శ్రీ సతీష్ బండారు ,పాలక మండలి సభ్యులు, కర్యక్రమ సమన్వయ కర్త శ్రీ  దయాకర్ మాడా, సంస్థ పాలక  మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :