టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ వార్.. వైసీపీ సామాజిక కార్యకర్తల అరెస్టులు..
గత ఎన్నికలకు ముందు టీడీపీ, వైసీపీ సైబర్ ఆర్మీ పేరుతో భారీగా ఉద్యోగులను చేర్చుకున్నాయి. తమ పాలనలో చేసిన ఘనతను ఘనంగా చెప్పుకుంటూనే.. ప్రత్యర్థిపార్టీలను ఎండగట్టడం దాని విధిగా నిర్ణయించాయి. అయితే తర్వాత్తర్వాత అది కాస్తా.. ప్రత్యర్థులను వేటాడే అస్త్రంగా మారింది. కాదు.. కాదు.. మార్చేశారంతే.. దీంతో టీడీపీపై వైసీపీ సైబర్ ఆర్మీ గట్టిగా విరుచుకుపడింది. అయితే దీనికి టీడీపీ సోషల్ ఆర్మీ కూడ అంతేస్థాయిలో బదులిచ్చింది. ఫలితంగా మహిళలు పలకలేని, వినలేని అసభ్య భాషతో పోస్టులు కుప్పలుగా సోషల్ మీడియాలో చేరిపోయాయి.
అయితే ప్రభుత్వం మారింది. ఇంకేముంది అసెంబ్లీలో స్థానాలు మారాయి. అంతే... ముందస్తుగా చెప్పినట్లుగా రాష్ట్రంలో రెడ్ బుక్ ను అమల్లోకి తెచ్చారు మంత్రి లోకేష్. దాని ప్రకారం వరుసగా వైసీపీ నేతలు అరెస్టులు, వారెంట్లు కొనసాగుతున్నాయి.ఫలితంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నోరెత్తి పడిపోయే లీడర్లు సైతం ఇప్పుడు గమ్మున ఉంటున్నారు. ఏమైనా అంటే.. పోలీసులు వచ్చి ఎక్కడ అరెస్టులు చేస్తారో అన్న భయం వారిని వెన్నాడుతోంది. ఇక వైసీపీ సైబర్ ఆర్మీ.. ఇప్పుడు అధికార పక్షానికి టార్గెట్ అయింది.
సాక్షాత్తూ హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ ఫ్యామిలీలోని మహిళలు, సీఎం చంద్రబాబు ఫ్యామిలీని టార్గెట్ చేసిన వైసీపీ సోషల్ ఆర్మీ నేతలను.. పోలీసులు టార్గెట్ చేశారు. ప్రభుత్వం ఆదేశాలతో వేట మొదలైంది. పక్కా ఆధారాలతో దొరికిన వారిని దొరికినట్లు మూసేస్తున్నారు. దీంతో వైసీపీ సోషల్ సైనికుల్లో ఆందోళన మొదలైంది. అది సాక్షాత్తూ అధ్యక్షుడి స్పీచ్ లోనూ వినిపించింది. సమస్యలపై ప్రశ్నిస్తే అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారంటూ జగన్ ఆందోళన వ్యక్తం చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అయితే ఈ విషయంలో వైసీపీకి.. ఇతర పార్టీల నుంచి మద్దతు రావడం లేదు. ఎందుకంటే పవర్ లో ఉన్నప్పుడు ఈ కార్యకర్తలు.. ఎవరినీ వదల్లేదు. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు.. వారిపై పోస్టులు కుమ్మరించారు. ఇప్పుడు ఎవరికి వారు మాకెందుకులే అన్నట్లుగా ఉండడంతో.. ఈ సోషల్ సైనికులు పోలీసుల కేసుల్లో పడి నలుగుతున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ సోషల్ మీడియా సైనికులను... సైతం పోలీసులు ఇలానే ఆడుకున్నారు. వారు కూడా కోర్టులు, ఇతరత్రా న్యాయమార్గాల ద్వారా పోరాటం చేశారు. వారికి టీడీపీ అండగా నిలిచింది.ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వీరి వంతైంది.