Revanth – Adani : అదానీకి హ్యాండ్ ఇచ్చిన రేవంత్..! బీఆర్ఎస్ టార్గెట్ వల్లేనా..?
దేశవ్యాప్తంగా అదానీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అదానీ ఇండియాలో అక్రమాలకు పాల్పడి కాంట్రాక్టులు దక్కించుకున్నారంటూ అమెరికాలో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన అరెస్టుకు సమన్లు కూడా జారీ అయ్యాయి. దీంతో అదానీ అరెస్టు ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీతో ఒప్పందాలు చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వాల పైన కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ సీఎం ముఖ్యమంత్రికి అదానీ ఇవ్వజూపిన వంద కోట్ల విరాళం కూడా వివాదాలకు కారణమైంది. ఈ అంశాన్ని బీఆర్ఎస్ పదేపదే లేవనెత్తుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్లకు ఉద్యోగాలు కల్పించాలనేది ఈ యూనివర్సిటీ ఉద్దేశం. దీనికి మెంటార్ / ఛాన్స్ లర్ గా మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తున్నారు. ఈ యూనివర్సిటీకి పలు సంస్థలు విరాళాలు ఇస్తున్నాయి. తాము కూడా ఇందులో భాగస్వాములవుతామని ముందుకొస్తున్నాయి. అందులో భాగంగా అదానీ కూడా రూ.వంద కోట్లు సీఎస్ఆర్ ఫండ్స్ కింద స్కిల్ యూనివర్సిటీకి విరాళం ప్రకటించారు.
జాతీయ స్థాయిలో అదానీని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదానీ – మోదీ కలిసి ఈ దేశాన్ని దోచేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అదానీ నుంచి విరాళాలు తీసుకోవడం, పెట్టుబడులు కోరడం విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాహుల్ గాంధీని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఢిల్లీలో రాహుల్ గాంధీ కూడా అదానీ నుంచి చట్టవ్యతిరేకంగా ఎవరు నిధులు తీసుకున్నా తప్పకుండా శిక్షించాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో లేనిపోని వివాదాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇస్తానని చెప్పిన వంద కోట్ల రూపాయలను తిరస్కరిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు అదానీ గ్రూప్ కు లేఖ రాసినట్లు వివరించారు. నిధులు బదిలీ చేయొద్దని కోరినట్లు తెలిపారు. అదానీతో తాము తెరవెనుక ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలను కాంగ్రెస్ పార్టీ అస్త్రాలుగా వాడుకునే అవకాశం ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలను రేవంత్ రెడ్డి చదివి వినిపించారు. వీటిపై విచారణ చేద్దామా అని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ కేటీఆర్ కాంగ్రెస్ కోర్టులోకి బంతి నెట్టి ఆడుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రివర్స్ లో బీఆర్ఎస్ కోర్టులోకి బంతి నెట్టారు.