ASBL Koncept Ambience
facebook whatsapp X

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదా..!?

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదా..!?

తెలంగాణలో పదేళ్లుగా పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారం చేపట్టిన బీఆర్ఎస్.. టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుంది. ఇక 2018లో రెండోసారి నెగ్గిన తర్వాత ఏకంగా కాంగ్రెస్  శాసనసభా పక్షాన్నే విలీనం చేసుకుంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించారు. దీనిపై బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది.

బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారని.. వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్. పార్టీ మారడమే కాకుండా ఏకంగా ఆ పార్టీ తరపున గత లోక్ సభ ఎన్నికల్లో దానం నాగేందర్ పోటీ చేసిన విషయాన్ని కూడా తీసుకెళ్లారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరినా సమయం ఇవ్వట్లేదని.. చర్యలు తీసుకోవట్లేదని కోర్టుకు తెలియజేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు తీర్పు వెల్లడించింది.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ పిటిషన్లను స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాలని అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లో ఏం చర్యలు తీసుకున్నారో స్టేటర్ రిపోర్ట్ ఫైల్ చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ నాలుగు వారాల్లోపు చర్యలు తీసుకోకపోతే ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరిస్తామని హైకోర్టు హెచ్చరించింది. దీనిపై బీఆర్ఎస్ సంతోషం వ్యక్తం చేసింది. కచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు ఉంటాయని.. ఉపఎన్నికలు రావడం ఖాయమని ఆ పార్టీ నేత పాడి కౌశిక్ రెడ్డి వెల్లడించారు.

అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాత్రం అంత తొందర పడొద్దని సూచిస్తున్నారు. స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ హైకోర్టు సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకుంటే డివిజన్ బెంచ్ కు, ఆపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి తీర్పును సమీక్షించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. గతంలో కేసీఆర్ కూడా పలువురు ఎమ్మెల్యేలను చేర్చుకుని ఐదేళ్లపాటు నాన్చిన విషయాన్ని ఫిరాయింపు ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. అప్పుడు లేని చట్టాలు, న్యాయాలు ఇప్పుడే బీఆర్ఎస్ కు గుర్తొస్తున్నాయా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కేసు ఆసక్తి రేపుతోంది. 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :