ASBL NSL Infratech

కేసీఆర్ కు హైకోర్టు షాక్..

కేసీఆర్ కు హైకోర్టు షాక్..

విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం విషయంలో బీఆర్ఎస్ అధినేత, మాజీసీఎం కేసీఆర్ కు గట్టిషాక్ తగిలింది. విద్యుత్‌ కమిషన్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం కొట్టేసింది. విద్యుత్‌ కమిషన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈక్రమంలో ఆయన తరఫు న్యాయవాదుల వాదనతో హైకోర్టు విభేదించింది. మరోవైపు నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తోందని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పారు. ఏజీ వాదనలను హైకోర్టు సమర్థించింది. విద్యుత్‌ కమిషన్‌ విచారణను కొనసాగించొచ్చంటూ స్పష్టం చేసింది.

జస్టిస్ నరసింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని వాదనల సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. విద్యుత్ కమిషన్ ఛైర్మన్ ముందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆధారాలు లేవని చెప్పింది. కేవలం విలేకర్ల సమావేశం నిర్వహించారనే కారణంతో జస్టిస్ ఎల్‌.నరసింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించారని అంటున్నారన్నారు. అనుమానించడం కాదని, దానికి తగిన ఆధారాలు చూపించాలని హైకోర్టు కోరింది.

జస్టిస్ ఎల్‌.నరసింహారెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో కేసీఆర్ విఫలమయ్యారని హైకోర్టు స్పష్టం చేసింది. కేసీఆర్‌కు జారీ చేసిన నోటీసుల్లో కమిషన్ ఛైర్మన్ ఎక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదంది. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం గురించి తెలుసుకోవడానికే ఆయనకు నోటీసులు జారీ చేశారని తేల్చి చెప్పింది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత పిటిషన్‌కు విచారణార్హత లేదని తేల్చినట్లు హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. హైకోర్టులో చుక్కెదురు కావడంతో ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత ఎలా ముందుకెళ్తారన్న ఆసక్తి రేగుతోంది. ఇప్పుడు హైకోర్టు కూడా కొట్టేయడంతో జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతారా..? లేదంటే సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయపోరాటాన్ని సాగిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఈపరిణామం మాత్రం కేసీఆర్, బీఆర్ఎస్ లకు రాజకీయంగా గట్టిదెబ్బే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :