ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి : బండి సంజయ్
ఏబీవీపీ నాయకులపై పోలీసులు, బాసర ఐఐఐటీ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం దుర్మార్గమని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న బాసర ఐఐఐటీ విద్యార్థిని స్వాతిప్రియ కుటుంబానికి న్యాయం చేయాలని అడిగితే విచక్షణ రహితంగా దాడి చేయిస్తారా? అని ప్రశ్నించారు. బాసర ఐఐఐటీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. విద్యార్థులు చనిపోతున్నా పట్టించుకోరా? న్యాయమైన డిమాండ్లను ఎందుకు పరిష్కరించడం లేదు. విద్యార్థుల పక్షాన ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం హేయమైన చర్య. బాసర ఐఐఐటీ విద్యార్థి స్వాతి ప్రియ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. అరెస్టు చేసిన ఏబీవీపీ నాయకులను తక్షణమే విడుదల చేయాలి. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు.