పాలస్తీనా కోసం గల్ఫ్ కంట్రీస్ కదిలాయి.. మరి ఇజ్రాయెల్ వ్యూహమేంటి?
హమాస్ పై ఇజ్రాయెల్ యుద్ధానికి ఏడాది పూర్తయింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి.. హత్యాకాండ జరపడంతో.. ఈ యుద్ధరంగంలోకి ఇజ్రాయెల్ దిగింది. హమాస్ తో పాటు హెజ్ బొల్లా ఉగ్రవాద సంస్థలను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గాజా, లెబనాన్, ఇరాన్ పై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతోంది. తాజాగా గాజా, లెబనాన్ తో ఇజ్రాయెల్ వివాదాన్ని పరిష్కరించేందుకు సౌదీ అరేబియా.. అరబ్ ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనుంది.
నవంబర్ 11న జరగనున్న ఈ సమ్మిట్.. పాలస్తీనా రాజ్యస్థాపనపై దృష్టి సారించనుంది. రియాద్ లో రెండు రోజుల పాటు ఈ చర్చలు జరగనున్నాయి. గత ఏడాది 2023 అరబ్ ఇస్లామిక్ ఎక్స్ ట్రార్డినరీ సమ్మిట్ కు కొనసాగింపుగా ఈ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇది సౌదీ అరేబియా రాజు సల్మాన్, ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అయితే, పాలస్తీనాకు రాజ్యాధికారం కల్పించేందుకు ఇజ్రాయెల్ పై ఎలా ఒత్తిడి తేవాలనే దానిపై ఈ సదస్సులో ఇస్లామిక్ దేశాలు చర్చించనున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, మధ్య ప్రాచ్యంలో నెలకొన్న అస్థిరత, యుద్ధం ముగింపునకు తీసుకోవాల్సిన చర్యలు వంటి ప్రధాన సమస్యలపై ఈ దేశాలు చర్చించనున్నాయి. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులను సౌదీ అరేబియా ఖండిస్తోంది. లెబనాన్ సమగ్రతను దెబ్బతీసే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2023లో జరిగిన అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశంలో గాజాపై దాడులను ఆపేందుకు, శాంతి స్థాపనకు కృషి చేసేందుకు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి.. ఈజిప్ట్, ఖతార్, జోర్డాన్, ఇండోనేషియా, నైజీరియా, తుర్కియే వంటి ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులతో పాటు ఇస్లామిక్ కో ఆపరేషన్ సంస్థ ప్రధాన కార్యదర్శులు అంగీకరించారు.