ఫ్రెండ్ షిప్ ఫ్రెండ్ షిప్.. బిజినెస్ బిజినెస్ అంటున్న ట్రంప్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలు దిశగా ట్రంప్ సర్కార్ అడుగులేస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఆంక్షలు విధిస్తామన్న ట్రంప్..ఆ ప్రకటనను అమల్లోకి తేనున్నారు.. మెక్సికో (Mexico), కెనడా (Canada) నుంచి దిగుమతయ్యే వస్తువులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల సరఫరా, వలసలకు వ్యతిరేకంగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
‘జనవరి 20వ తేదీన నా మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లలో ఒకటిగా.. మెక్సికో, కెనడా నుంచి అమెరికాకు వచ్చే అన్ని ఉత్పత్తులపై 25శాతం సుంకం విధించడానికి అవసరమైన పత్రాలపై సంతకం చేస్తాను’ అని పేర్కొన్నారు. దీంతోపాటు చైనా (China) వస్తువులపై సైతం 10 శాతం సుంకం విధించాలని నిర్ణయించుకున్నట్లు మరో పోస్ట్‌లో రాసుకొచ్చారు. అయితే తన నిర్ణయం వల్ల కంపెనీల దిగుమతులు తగ్గి, తయారీ పరిశ్రమలు వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నారు ట్రంప్. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరికొన్ని రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఆర్థిక అజెండాలో సుంకాలు కీలకమైనవి.
అయితే, ఈ సుంకాలు దేశవృద్ధిని దెబ్బతీస్తాయని, ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని పలువురు ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. సుంకాలపై వ్యతిరేకంగా పోరాడాలి: కెనడా కెనడా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం సుంకాలు విధించడాన్ని కెనడా నాయకుడు జిగ్మిత్ సింగ్ (Jagmeet Singh) వ్యతిరేకించారు. ఈమేరకు సుంకాలు పెంచినట్లు ఉన్న వార్తను ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సుంకాల పెంపు విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వం దేశం కోసం నిలబడాలని, సుంకాల పెంపునకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.