ట్రంప్ కేబినెట్ 2.0.. యువతకు పెద్దపీట...
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన క్యాబినెట్, కార్యవర్గాల్లో యువతకు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా చురుగ్గా, మంచి వాగ్దాటి , కార్యశీలత ఉన్న వ్యక్తులను ఏరికోరి నియామకాలు చేస్తున్నారు. ఇందులోనూ విధేయతకు చక్కని అవకాశాలిస్తున్నారు. ఈసారి స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ తో సంచలన నిర్ణయాలు ఉంటాయని ట్రంప్ టీమ్ ను బట్టి అర్థమవుతోంది. \ 78ఏళ్ల వయస్సులో ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్ట బోతున్నారు.
జనవరి 20న ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఆయన అడ్మినిస్ట్రేషన్ టీమ్ లో ఎక్కువగా యువ నాయకత్వానికి ప్రాధాన్యతనిస్తున్నారు. ట్రంప్ 2.0 టీమ్ లో ఇప్పటి వరకు నియమించిన వారిలో 40 – 45 ఏళ్ల మధ్య వయసున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్)కి నాయకత్వం వహించడానికి ఎలోన్ మస్క్ (53)తో పాటు ట్రంప్ ఎంపిక చేసిన వివేక్ రామస్వామి వయస్సు 39 మాత్రమే. 40 సంవత్సరాల వయస్సులో ఒహియో నుంచి తొలిసారి సెనేటర్ అయిన జేడీ వాన్స్ యూఎస్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన వైస్ ప్రెసిడెంట్ లలో ఒకరు.
అమెరికా సైన్యంలో పనిచేసిన తులసీ గబ్బార్డ్ తదుపరి ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా ట్రంప్ ఎంపిక చేశారు. ఆమె వయస్సు కేవలం 43ఏళ్లు మాత్రమే. జో బైడెన్ టీమ్ లో ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా పనిచేసిన అవ్రిల్ హైన్స్ కంటే తులసి గబ్బార్డ్ 12ఏళ్లు చిన్నది. అదేవిధంగా పీట్ హెగ్‌సేత్ (రక్షణ కార్యదర్శి), లీ జెల్డిన్ (ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అడ్మినిస్ట్రేటర్), ఎలిస్ స్టెఫానిక్ (యునైటెడ్ నేషన్స్ అంబాసిడర్), మాట్ గేట్జ్ (అటార్నీ జనరల్ మరియు జస్టిస్ డిపార్ట్‌మెంట్ హెడ్) వయస్సు 40-45 మధ్య ఉన్నాయి.