టీటీడి ప్రక్షాళన దిశగా బోర్డ్ చైర్మన్ బిఆర్ నాయుడు.. బోర్డ్ సమావేశంలో సూపర్ 8 నిర్ణయాలు...
అత్యంత పవిత్ర క్షేత్రం అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులు కాని వారు పని చేయడానికి వీలు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ సమావేశంలో తీర్మానించినట్లు బోర్డ్ చైర్మన్ బి.ఆర్ నాయుడు తెలిపారు.
బీఆర్ నాయుడు తన తొలి సమావేశంలోనే సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. అజెండాలోని 80 అంశాలను పరిశీలించి సభ్యులు నిర్ణయాలు తీసుకున్నారు. గత ఐదేళ్లలో పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించి కొన్నింటిని రద్దు చేశారు. సమావేశం వివరాలను బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు.
అన్యమత ఉద్యోగులపై తీర్మానం
టీటీడిలో పనిచేస్తున్న హిందువులు కాని ఉద్యోగులు తమ ఉద్యోగాలకు స్వచ్ఛంద పదవీ విరమణ చేయడమో లేక రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ అయినా కావాల్సి ఉంటుంది. ఈ మేరకు టీటీడీ ఒక తీర్మానాన్ని ఆమోదించినట్లు ఆయన తెలిపారు.
టీటీడీలో ఏడు వేల మంది ప్రత్యక్షంగా మరో పద్నాలుగు వేల మంది కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నారు. బోర్డ్ ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హిందూయేతర ఉద్యోగులుగా ఉన్న 300 మందికిపైగా ఉద్యోగులపై ప్రభావం పడుతుందని అంటున్నారు. తిరుమల పవిత్రత కాపాడుతామని గత నెల 31న టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పుడే బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఆయన ఆనాడు మాట్లాడుతూ, తిరుమలలో పనిచేసే ప్రతి ఒక్కరూ హిందువులే కావాలని కోరారు. అయితే హిందూయేతర సిబ్బందిని బదిలీ చేయవచ్చా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలా అన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తానని నాయుడు చెప్పారు. బోర్డ్‌లో కూడా ఆమేరకు తీర్మానం చేశారు.
తిరుమలలో హిందువులే ఉండాలని అన్య మతస్థులు ఉండరాదని టీటీడీ కొత్త బోర్డు గట్టిగా తీర్మానించుకుంది. బీఆర్ నాయుడు అయితే హిందూ విశ్వాసానికి, పవిత్రతకు ప్రతీకగా తిరుమల నిలిచిపోయేలా తాను నిబద్ధతతో పని చేెస్తాను దానికి తగ్గట్లే నిర్ణయాలు ఉంటాయని చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
శ్రీవాణి ట్రస్ట్ పేరు మార్పు
శ్రీవాణి ట్రస్ట్ పేరును మార్చనున్నట్లు బోర్డ్ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. అలాగే ఈ పథకం మాత్రం కొనసాగుతుందని, ఆ నిధులను మాత్రం ప్రధాన ట్రస్టుకు తరలిస్తామని అన్నారు.
ముంతాజ్ హోటల్స్ ఇచ్చిన భూమి రద్దుపై తీర్మానం
టీటీడి గతంలో దేవలోకం ప్రాజెక్ట్‌కు కేటాయించిన 60 ఎకరాల్లో 20 ఎకరాలను ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి గత వైసిపి ప్రభుత్వం, అప్పటి బోర్డ్ ఇచ్చిన అనుమతిని వివాదం కారణంగా రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేశామని బీఆర్ నాయుడు తెలిపారు.
2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అలిపిరి సమీపంలో దేవలోకం పేరుతో ఓ భారీ పర్యాటక ప్రాజెక్ట్‌ను నిర్మించ తలపెట్టిందని, దీనికోసం అప్పట్లో 60 ఎకరాలను కేటాయించిందని అన్నారు. 2019 తరువాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం దీన్ని మార్చివేసిందని, దేవలోకం ప్రాజెక్ట్‌కు కేటాయించిన 60 ఎకరాల్లో 20 ఎకరాలను ముంతాజ్ హోటల్స్ నిర్మాణానికి మంజూరు చేసిందని వివరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారిందని, మళ్లీ ఈ వివాదం తెర మీదికి వచ్చిన నేపథ్యంలో దీన్ని రద్దు చేయాలని తీర్మానించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. ముంతాజ్ హోటల్స్‌కు కేటాయించిన స్థలం లీజును వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోన్నామని చెప్పారు. ఈ మేరకు టీటీడీ పాలక మండలి ఆమోదించిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపిస్తామని పేర్కొన్నారు. ఆ స్థలాన్ని మళ్లీ టీటీడీకే అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరనున్నామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
తిరుపతి ప్రజలకు కానుక
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ఇకపై 2 నుంచి 3 గంటల్లోనే దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బీఆర్ నాయుడు చెప్పారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం లభించేలా చూస్తామని వివరించారు. తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని వివరించారు.
టూరిజం శాఖ దర్శన కోటా రద్దు
ఎపి, తెలంగాణ. ఇతర టూరిజం శాఖలకు ఇస్తున్న ప్రత్యేక శ్రీవారి దర్శనం కోటాను రద్దు చేస్టున్నల్లు బోర్డ్‌లో తీర్మానం చేశామని చైర్మన్ తెలిపారు. ఈ టూరిజం శాఖకు కేటాయించే 4 వేల టికెట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. టూరిజం శాఖకు కేటాయించే టికెట్లలో అవకతవకలు జరిగాయని గత ప్రభుత్వంలో టూరిజంలో ఉన్న కొందరుదళారులు ఈ టిక్కెట్లను అమ్ముకున్నారని, టీటీడి పేరు ప్రతిష్టలను మంటగలిపారని ఆరోపించారు. అందుకే ఈ కోటాను రద్దు చేస్టున్నట్లు చెప్పారు.
రాజకీయాలు వద్దు...
తిరుమలలో ఇకపై రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు చేపడతామని తెలిపారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు పెడతామని స్పష్టం చేశారు.
మరిన్ని నిర్ణయాలు..
తిరుమలలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుస్తామని, లడ్డూ నాణ్యత మరింత పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు బోర్డ్ చైర్మన్ తెలిపారు. అలాగే అన్నదానంలో నూతనంగా మరో ఐటమ్‌ని భక్తులకు వడ్డించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న బ్రహ్మోత్సవ బహుమానాన్ని రూ.14 వేల నుంచి రూ.15,400లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేయడంతోపాటు, వైసీపీ హయాంలో శారద పీఠానికి కేటాయించిన భూములు రద్దు చేస్తూ బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో తొలగిస్తామని అన్నారు. తిరుపతిలోని శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ కు గరుడ వారధిగా పేరు మార్చామని కూడా బీఆర్ నాయుడు వెల్లడించారు.