తిరుమలలో వారికే పెద్దపీట.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ చైర్మన్..
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరని భక్తులకు టీటీడీ (TTD) శుభవార్త వినిపించింది. తాజాగా జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తిరుపతికి వచ్చే భక్తులకు ఊరట కలిగించే విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్యుల కు ప్రాధాన్యత ఇచ్చే విధంగా టీటీడీ ఛైర్మన్ ( TTD Chairman) మరియు టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి. సాధారణంగా తిరుమల లో రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సర్వదర్శనం కౌంటర్ లో ఉన్న భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.
కొన్ని సందర్భాలలో సర్వదర్శనానికి (Sarvadarshan) వెళ్లినవారు గంటల తరబడి కంపార్ట్మెంట్ లోనే వెయిట్ చేయాల్సి ఉంటుంది. పండగ రోజులలో దర్శనాలు మరింత కష్టమవుతాయి. ఇలాంటి అప్పుడు క్యూలైన్ దాటి కంపార్ట్మెంటులో కూడా కొన్ని గంటలు భక్తులు అలాగే ఉండాల్సిన పరిస్థితిని మనం గమనిస్తాం. అయితే ఈ సమస్యకు చెక్కపెట్టే విధంగా టీటీడీ చైర్మన్ తాజాగా జరిగిన పాలకమండలి (TTD Dharmakartala Mandali) సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా , ఏఐ లాంటి అధునాతన సాంకేతికను ఉపయోగించడానికి చైర్మన్ తీసుకున్న నిర్ణయం ఎంతో హర్షించదగినది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) సహాయంతో సామాన్య భక్తులకు కూడా దర్శనం వీలైనంత త్వరగా కల్పించే విధంగా వసతి కల్పించడానికి టీటీడీ చైర్మన్ భావిస్తున్నారు.
మరోవైపు తిరుపతి పట్టణ వాసుల సౌలభ్యం కోసం ప్రతినెలా వచ్చే మొదటి మంగళవారం నాడు తిరుపతి ప్రజలకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కలిగించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్ (TTD Chairman) బీఆర్ నాయుడు(B.R.Naidu) తెలిపారు. అలాగే ప్రజలు కోరుకున్నట్టుగా శ్రీనివాస సేతు (Srinivasasethu) ఫ్లైఓవర్ పేరుని కూడా తిరిగి గరుడ వారధిగా (Garudavaradhi) మార్చబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇక తిరుపతిలో ప్రధాన సమస్యగా మారిన డంపింగ్ యార్డ్ విషయంలో కూడా చైర్మన్ నేతృత్వంలో టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుపతి డంపింగ్ యార్డ్ (Dumping yard) లో పేరుకుపోయిన చెత్తను మూడు నెలలలో తొలగిస్తామని టీటీడీ చైర్మన్ స్పష్టం చేశారు. టూరిజానికి కేటాయించినటువంటి నాలుగువేల దర్శన టికెట్లను కూడా రద్దు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాదు స్వామివారి సన్నిధి రాజకీయాలకు అతీతంగా ఉండాలి అని స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్(TTD Chairman) .. స్వామివారి సన్నిధిలో రాజకీయాల గురించి ప్రస్తావించిన వారిపై తీవ్రమైన చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.