ASBL Koncept Ambience
facebook whatsapp X

జమిలి ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!! ఆచరణ సాధ్యమా..!?

జమిలి ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!! ఆచరణ సాధ్యమా..!?

ఒకే దేశం – ఒకే ఎన్నిక.. చాలాకాలంగా వినిపిస్తున్న పేరు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ నినాదం వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థ గందరగోళంలో ఉందని.. ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎన్నిక జరుగుతోందని.. దీని వల్ల అభివృద్ధి విఘాతం కలుగుతోందని బీజేపీ చెప్తూ వస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందనేది ఆ పార్టీ మాట. ఇప్పుడు ఆ దిశగా మరో ముందడుగు వేసింది బీజేపీ. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికను ఆమోదించింది.

కేంద్రంలో 2014 నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉంది. 2019 ఎన్నికల తర్వాత జమిలి ఎన్నికల ప్రతిపాదనను బీజేపీ తెరపైకి తెచ్చింది. దీనిపై సుదీర్ఘ కసరత్తు ప్రారంభించింది. వివిధ రాష్ట్రాలు, పార్టీలతో చర్చలు కూడా జరిపింది. 2024 ఎన్నికల సమయంలోనే దేశవ్యాప్తంగా ఒకేసారి వీటిని జరిపేందుకు ప్రయత్నించింది. అయితే కుదరలేదు. దీనిపై శాస్త్రీయ అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలోనే మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్నికలకు ముందే ఆ ప్యానల్ నివేదిక సమర్పించింది. మరోవైపు బీజేపీ తన మేనిఫెస్టోలో కూడా జమిలి ఎన్నికల ప్రతిపాదన చేర్చింది.

నాడు రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికను ఇవాళ కేంద్ర కేబినెట్ ఆమోదించింది. జమిలి ఎన్నికలకు కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. దీంతో ఎట్టిపరిస్థితుల్లో ఈ పరిపాలనా కాలంలోనే జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని హోంమంత్రి అమిత్ షా కూడా స్పష్టం చేశారు. కేబినెట్ ఆమోదించిన బిల్లును వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. అది ఆమోదం పొందితే జమిలి ఎన్నికలకు మార్గం క్లియర్ అయినట్టే. కోవింద్ సిఫారసుల ప్రకారం దేశవ్యాప్తంగా కామన్ ఓటర్ లిస్టును ప్రిపేర్ చేయాల్సి ఉంది. వన్ నేషన్ – వన్ ఓటర్ కార్డ్ రూపొందితే జమిలి ఎన్నికల నిర్వహణ సులభం అవుతుంది.

అయితే వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంత ఈజీ కాదు. ఇందుకోసం 18 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది. వీటిలో కొన్నిటికి పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. మెజారిటీ అంశాలకు రాష్ట్రాల ఆమెదంతో సంబంధం లేకపోయినా వివిధ రాష్ట్రాలు, పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. దీంతో ఇది ఆచరణ సాధ్యమేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పార్లమెంటులో ఈ బిల్లును తాము అడ్డుకుంటామని కాంగ్రెస్ ఇప్పటికే హెచ్చరించింది. మరి ఈ చిక్కుముళ్లను బీజేపీ ఎలా పరిష్కరిస్తుందనేది వేచి చూడాలి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :