ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎయిర్ కనెక్టివిటీ దిశగా ఏపీ.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఫోకస్..

ఎయిర్ కనెక్టివిటీ దిశగా ఏపీ.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఫోకస్..

సమస్యలతో సతమతమవుతున్న కొత్త రాష్ట్రం ఏపీ అభివృద్ధిపై ఎన్డీఏ కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా ఏపీకి ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు చేపడుతోంది. త్వరలోనే గన్నవరం నుంచి దుబాయి, సింగపూర్‌లకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి మీద స్పెషల్ ఫోకస్ పెడతామన్న మంత్రి.. విజయవాడ నుంచి విమాన ప్రయాణికుల సంఖ్యను పెంచుతామన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో అప్రోచ్ రహదారిని, విజయవాడ- ఢిల్లీ ఇండిగో సర్వీసును మంత్రి ప్రారంభించారు. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే నాలుగు కొత్త సర్వీసులు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే అక్టోబర్‌ 26న విజయవాడ- పుణె విమాన సర్వీసు, అక్టోబర్ 27న విశాఖపట్నం- దిల్లీ సర్వీసులను ప్రారంభిస్తామన్నారు.

మరోవైపు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రస్తుతం షార్జాకు సర్వీసులు నడుస్తున్నాయన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. దుబాయి, సింగపూర్‌లకు కూడా సర్వీసులు ప్రారంభిస్తామన్నారు. ఏడాదిలోగా గన్నవరం ఎయిర్‌పోర్టులో నూతన టెర్మినల్ ప్రారంభిస్తామని చెప్పారు. యావత్ దేశం ఏపీవైపు చూసేలా ఆంధ్రప్రదేశ్‌కు కనెక్టివిటీ పెంచుతామన్న రామ్మోహన్ నాయుడు..ఈ క్రమంలోనే కొత్త ఎయిర్‌పోర్టులను కూడా నిర్మిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా 200 ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఏపీలో గన్నవరం ఎయిర్‌పోర్టు విమానాశ్రయ పనులు వేగం పుంజుకున్నాయి. ప్రతినెలా ఎయిర్ పోర్టును సందర్శిస్తున్న మంత్రి.. పనులు సాగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఏపీలో కొత్తగా మరో 7 ఎయిర్‌పోర్టులను సైతం నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు నాయుడుతోనూ, కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పటికే చర్చలు జరిపారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలపైనా అధ్యయనం చేయనున్నట్లు కేంద్ర మంత్రి ఇప్పటికే వెల్లడించారు. ఏపీలోని కుప్పం, నాగార్జునసాగర్, దొనకొండ, దగదర్తితో పాటుగా ఒంగోలు, అనంతపురంలోనూ విమానాశ్రయాలు ఏర్పాటుచేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్ల సంఖ్యను పెంచి అనుసంధానాన్ని పెంచి.. ఈస్ట్ కోస్ట్‌కు లాజిస్టిక్ హబ్‌గా తయారుచేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :