ASBL Koncept Ambience
facebook whatsapp X

ఉక్రెయిన్ పైకి కిమ్ సేన... శవాలే తిరిగి వెళ్తాయన్న అమెరికా..

ఉక్రెయిన్ పైకి కిమ్ సేన... శవాలే తిరిగి వెళ్తాయన్న అమెరికా..

రష్యా ఉక్రెయిన్ వార్ కాస్తా మూడో ప్రపంచయుద్ధానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. మొన్నటివరకూ ఓ వైపు రష్యా.. మరోవైపు నాటో కూటమి అండతో ఉక్రెయిన్ పోరాడుతున్నాయి. అయితే ఈ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని... ఇరుదేశాలు సంధికి వస్తాయని అందరూ భావించారు. అయితే వాటన్నంటినీ తలక్రిందులు చేస్తూ.. పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా రష్యాకు కిమ్ సేన.. దాదాపు 10 వేల మంది సైనికులు వెళ్తున్నారు. ఈవిషయాన్ని నాటో సైతం ధృవీకరించింది. ఇప్పటికే రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ప్యాంగాంగ్ సేనలను మోహరించినట్లు తెలిపింది.

ఉక్రెయిన్ సరిహద్దుల్లోని కుర్క్స్‌ ప్రాంతంలో ఉత్తర కొరియా బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టే తెలిపారు. ఉక్రెయిన్‌- రష్యా సంఘర్షణలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం సమంజసం కాదని.. ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు. అటు, రష్యాలోకి కిమ్‌ సేనలు ఎంట్రీపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ సైతం ధ్రువీకరించింది. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యాకు సాయంగా పోరాటం, శిక్షణ కోసం 10 వేల మంది సైనికులను ఉత్తర కొరియా పంపిందని పెంటగాన్ అధికార ప్రతినిధి సబ్రీనా సింగ్ వెల్లడించారు.

ఉక్రెయిన్‌తో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న కుర్స్క్ ప్రాంతంలో మోహరించినట్టు తాము బలంగా నమ్ముతున్నామని సింగ్ అన్నారు. దాదాపు మూడేళ్లుగా సాగుతోన్న యుద్ధం కారణంగా ఈ ప్రాంతంలో పరిస్థితులు దిగజారాయని, ఇప్పుడు ఉత్తర కొరియా చేరడం మరింత ప్రమాదకరంగా మారుతాయని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ యుద్ధంలో కనుక ఉత్తరకొరియా సైనికులు దిగితే.. వారి శవాల బ్యాగులు ప్యాంగ్ యాంగ్ కు వెళ్తాయని హెచ్చరికలు చేసింది.అంతేకాదు, కిమ్‌ సైన్యం మద్దతు తీసుకోవడం రష్యా బలహీనతను తెలియజేస్తోందని ఎద్దేవా చేసింది. ఈ క్రమంలోనే రష్యాలోకి ఉత్తర కొరియా బలగాలు ప్రవేశించడం గమనార్హం.అటు, ఈ పరిణామాలు అంతర్జాతీయ భద్రతకు ప్రమాదకరమని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సూక్ యోల్ చెప్పారు.

రష్యాకు ఉత్తర కొరియా సైన్యాలు పంపడం అక్రమ సైనిక సహకారమని, తమ జాతీయ భద్రతతో పాటు అంతర్జాతీయ సమాజానికి తీవ్ర ముప్పుగా మారుతుందని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్ పైకి యుద్దానికి కిమ్ సేన పంపిస్తుండడంపై జెలెన్ స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై చైనా మౌనం దాల్చడం సరికాదన్నారు ఇప్పటికే రష్యా కర్మాగారాల్లో ఉత్తరకొరియా ఆయుదాలు, కార్మికులు ఉన్నారని.. ఇప్పుడు ఏకంగా వారి సైనికులు కూడా వస్తున్నారన్నారు. వారు మరికొన్ని రోజుల్లో తమపైకి దండెత్తనున్నారన్నారు. ఉత్తరకొరియా-రష్యా మధ్య ఉన్న సైనిక సహకారాన్ని సైతం జెలెన్ స్కీ మరోసారి గుర్తు చేశారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :