ASBL NSL Infratech

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూత

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డీఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్‌ మంత్రిగా సేవలందించారు. పీసీసీ అధ్యక్షుడిగానూ ఆయన పనిచేశారు.  డీఎస్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్‌ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్‌ గతంలో నిజామాబాద్‌ మేయర్‌గా పనిచేశారు. 

1948 సెప్టెంబర్‌ 27న జన్మించిన డీఎస్‌.. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్‌ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌  శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. 2004లో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తులో క్రియాశాలక పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో వైఎస్‌తో కలిసి పనిచేశారు.  2013 నుంచి 2015 వరకు శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలిలో విపక్ష నేతగా కొనసాగారు. 2016 నుంచి 2022 వరకు టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌తో విభేదించి, కాంగ్రెస్‌ నేతలతో మంతనాలు జరిపి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.  

డీఎస్‌ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో డీఎస్‌ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. డీఎస్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం  ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎస్‌ మృతి పట్ల  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.  ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు. డీఎస్‌ మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంతాపం తెలిపారు. మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీలో డీఎస్‌ ట్రబుల్‌ షూటర్‌గా పేరుగాంచిన ఆయన మృతి పార్టీకి తీరని లోటని  పేర్కొన్నారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :