ASBL Koncept Ambience
facebook whatsapp X

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇక లేరు

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇక లేరు

ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి (72)  కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన ఆయన ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్‌గా గుర్తింపు పొందిన ఏచూరి 1992 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. సీతారాం ఏచూరి మద్రాస్‌ (ప్రస్తుతం చెన్నై)లో తెలుగు కుటుంబంలో 12 ఆగస్టు 1952న జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ రోడ్‌ కార్పొరేషన్‌ ఇంజినీర్‌. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి. ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ మోమన్‌ కందాకు మేనల్లుడు. 

ఏచూరి బాల్యం హైదారాబాద్‌లోనే గడిచింది. ఇక్కడి ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్‌ ఎస్టేట్‌ స్కూల్‌లో చేరారు. 1970లో సీబీఎస్‌సీ హయ్యర్‌ సెకండరీ పరీక్షలో ఆల్‌ ఇండియా ర్యాంకర్‌గా నిలిచారు. ప్రఖ్యాత సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ పూర్తి చేశారు. జేఎన్‌యూ నుంచి ఎంఏ పట్టా పొందారు. అక్కడే పీహెచ్‌డీలో చేరిన ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో దాన్ని కొనసాగించలేకపోయారు. సీతారం మొదటి భార్య ఇంద్రాణి మజుందార్‌. జర్నలిస్టు సీమ చిశ్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. 

ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నేతగా 1974లో సీతారం ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నప్పుడు సీపీఎంలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయిన వారిలో ఆయన కూడా ఒకరు. జేఎన్‌యూ స్టూడెంట్స్‌ యూనియన్‌కు మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారాత్‌తో కలిసి జేఎన్‌యూను వామపక్ష కోటగా మార్చారు. ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. 1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరారు. 1992లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005లో పశ్చిమ బెంగాల్‌ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నం లో జరిగిన 21వ  సీసీఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆయన పదవిలో కొనసాగుతున్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :